ఇదో క్రమ'శిక్ష'ణ! హైదరాబాద్ : ఏడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఏడేళ్ళ బాలుడిని స్కూల్ నుంచి బహిష్కరించింది. విడ్డూరమైన ఈ క్రమశిక్షణ చర్యకు ఆగ్రహం చెందిన రెండవ తరగతి విద్యార్థి సయ్యద్ ముస్తఫా హుస్సేన్ తల్లిదండ్రులు న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్ హెచ్ఆర్ సి)ని ఆశ్రయించారు. బషీర్ బాగ్ లో పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న రిషి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఈ శిక్ష విధించింది. ముస్తఫా తండ్రి, నూర్ ఖాన్ బజార్ వాసి అయిన సయ్యద్ దావూద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ, తాను, తన భార్య తమ కుమారుని ఈ నెల 9న స్కూలుకు తీసుకువెళ్ళామని, కాని ఏడు నిమిషాలు ఆలస్యంగా స్కూలుకు చేరుకున్నామని తెలియజేశారు. గర్భిణి అయిన తన భార్యను స్కూలు లోపలికి రానివ్వకుండా, గేట్ల వద్ద 40 నిమిషాల సేపు వేచి ఉండేట్లు చేశారని ఆయన ఆరోపించారు. 'ఇదేమి పనని తాను ప్రశ్నించినప్పుడు ప్రిన్సిపాల్ భవానీ చంద్ర గట్టిగా కేకలు వేసి, ముస్తఫాకు రికార్డు షీట్ ఇవ్వగలమని చెప్పినట్లు ఆయన తెలిపారు.
తాను, తన భార్య 11న స్కూలుకు వెళ్ళామని, కాని తమను గేటు బయటే నిలబెట్టేశారని దావూద్ చెప్పారు. తన కుమారుని ఇంటికి తీసుకువెళ్ళవచ్చునని దావూద్ తో యాజమాన్యం చెప్పినట్లు తెలుస్తున్నది. అయితే, 12న ముస్తఫాను ఆయన స్కూలు వద్ద దింపిన తరువాత ఉదయం సుమారు 10.30 గంటలకు ఆయనకు ఒక కాల్ వచ్చింది. తమ కుమారుని తిరిగి తీసుకువెళ్ళవలసిందని ఆయనను ఫోన్ లో కోరారు. 'విద్యార్ధుల ఉదయం సమావేశం సమయంలో నా కుమారుని ఒక్కడిని వేరు చేసి రిసెప్షన్ హాలు వద్ద వేచి ఉండేట్లు చేశారు' అని అతని తల్లి ఫర్హత్ హుస్సేన్ చెప్పారు. 'అతను ఏడేళ్ళవాడు. ఇది అతని మనసుపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది?' అని ఆమె అన్నారు. అయితే, యాజమాన్యాన్ని సంప్రదించిన తరువాత తాను రికార్డు షీటు జారీ చేశానని ప్రిన్సిపాల్ భవానీ చంద్ర తెలిపారు. మరి బాలుని ఎందుకు బర్తరఫ్ చేశారనే ప్రశ్నకు, అతని తల్లిదండ్రులు దురుసుగా ప్రవర్తించారని ప్రిన్సిపాల్ సమాధానం ఇచ్చారు. ఎస్ హెచ్ఆర్ సి ఈ కేసును చేపట్టనున్నట్లు ముస్తఫాకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది జువేరియా ఫర్హత్ తెలిపారు.
News Posted: 17 November, 2009
|