హెడ్లీతో బాలీవుడ్ భామ? ముంబయి : డేవిడ్ హెడ్లీ కేసులో రాహుల్ భట్ తరువాత ఒక నటితో సహా మరికొందరు సినీ ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ నటి హెడ్లీతో కలసి డిన్నర్ కు వెళ్ళినట్లు తెలుస్తున్నది. రాహుల్ భట్, ఇతర ఉమ్మడి మిత్రుల ద్వారా వారికి హెడ్లీతో సంబంధాలు ఏర్పడ్డాయని అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి. వారిలో చాలా మంది బ్రీచ్ కాండిలోని మోక్ష్ ఫిట్ నెస్ సెంటర్ లో కలుసుకున్నారు. హెడ్లీ అక్కడే వ్యాయామం చేస్తుండేవాడు. అయితే, హెడ్లీతో సంబంధం ఉన్న బాలీవుడ్ ప్రముఖులు ఎవరి గురించీ తమ వద్ద సమాచారం లేదని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలియజేశారు.
ఆ సినీ ప్రముఖులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) రాహుల్ భట్ తో పాటు ప్రశ్నించగలదని ఆ వర్గాలు సూచించాయి. హెడ్లీ నటులతో స్నేహం చేశాడనీ, వారిలో కొందరితో పార్టీలు జరుపుకున్నాడని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, అతనికి ఉగ్రవాదంతో సంబంధం ఉన్న సంగతి వారికి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు పేరు వినిపిస్తున్న నటి ప్రముఖ బాలీవుడ్ నటులు కొందరి సరసన నటించారు. అయితే, ఆ నటిని హెడ్లీకి ఎన్నడూ పరిచయం చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. 'వారు ఒకే జిమ్ కు వెళ్ళడం కాకతాళీయం. నా కుమార్తె హెడ్లీ గురించి ఎన్నడూ వినలేదు' అని ఆమె తల్లి చెప్పారు.
చిత్రాలలో చుంబన సన్నివేశాలకు పేరు పొందిన మరొక నటుడు కూడా హెడ్లీని కలుసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే, హెడ్లీతో తన సంబంధాల గురించి ఏమైనా అడగదలిస్తే ఎన్ఐఎనే అడగండని ఆ నటుడు అన్నారు. హెడ్లీ తన పాకిస్తానీ సహచరులతో మాట్లాడేటప్పుడు రాహుల్ పేరును ఉపయోగించినట్లు అమెరికన్ నేర పరిశోధక సంస్థ ఎఫ్ బిఐ కనుగొన్న తరువాత రాహూల్ వివాదంలో చిక్కుకున్నారు. ముంబైకి హెడ్లీ, అతని బృందంలోని ఇతరులు వాడిన సంకేత నామం 'రాహుల్'.
News Posted: 17 November, 2009
|