ఖరీదైన జాప్యం న్యూఢిల్లీ : యేటా సుమారు 150 కోట్ల రూపాయల విలువైన పెట్రోలు, డీజిల్ ను వృధాగా తగలెడుతున్నాం. దీనికి కారణం మన చెక్ పోస్టులే. వాహనాలకు చెందిన పత్రాలను తనిఖీ పేరుతో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల భారతదేశం ఇంత నష్టపోతోంది. భారత రవాణా సంస్థ(టిసిఐ), కోల్ కతా ఐఐఎం సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ సంగతి బయటపడింది. దేశంలో ఉన్న రాష్ట్రాల సరిహద్దుల్లోని చెక్ పోస్టులు, రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టుల కారణంగా ఈ నష్టం వాటిల్లుతోందని పరిశోధకులు తేల్చి చెప్పారు. అంతేనా అధ్వాన్నమైన రహదారుల కారణంగా వాహనాల సరాసరి వేగం గంటకు ఇరవై కిలోమీటర్లకు పరిమితమైపోతోందని కూడా వివరించింది. జాతీయ రహదారలపై అడుగడుగునా ఉన్న అనేక అడ్డంకుల కారణంగా భారతదేశంలో ఒక ట్రక్కు రోజుకు 250 నంచి 400 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తోందని, అదే అమెరికాలో ఈ వేగం 700 నుంచి 800 కిలోమీటర్లుగా ఉందని ఈ సర్వే పేర్కొంది.
దేశంలో 2001-09 మధ్య వాహనాల పెరుగుదల 9.4 శాతంగా ఉందని అదే జాతీయ రహదారుల నెట్ వర్క్ మాత్రం 2.4 శాతం పెరిగిందని తెలిపింది. చెక్ పోస్టుల వద్ద జరిగే ఆలస్యం వలన సమస్యలు వస్తున్నాయని తేలింది. ఢిల్లీ-బెంగళూరల నడుమ 30 ట్రిప్పులు తిరిగే వాహనం కనీసం పాతికసార్లు ఆగాల్సి ఉంటుంది. వీటిలో 15 హాల్టులు టోల్ పాయింట్ల దగ్గర ఉంటాయి. మొత్తం 5 గంటల సేపు వాహనం ఆగిపోతోంది. సరాసరి ప్రయాణ సమయంలో ఇది 5 శాతంగా ఉందని సర్వేలో బయటపడింది.
News Posted: 18 November, 2009
|