ఆకర్షిస్తున్న అమెరికా చదువు న్యూఢిల్లీ : 2009 సంవత్సరంలో అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులలో భారతీయ విద్యార్థులదే అగ్ర స్థానం. భారతీయ విద్యార్థుల సంఖ్య 1,03,260గా ఉన్నది. క్రితం సంవత్సరం సంఖ్య 94,563 కన్నా ఇది 9 శాతం అధికం. భారతీయ విద్యార్థులు ఇలా అగ్ర స్థానం ఆక్రమించడం ఇది వరుసగా ఎనిమిదవ సంవత్సరం.
ఇండియాలోని అమెరికా రాయబారి తిమోతి రోమర్ బుధవారం న్యూఢిల్లీలో విలేఖరుల గోష్ఠిలో ఈ విషయం వెల్లడిస్తూ, ఇండియాలోని అమెరికన్ విద్యార్థుల సంఖ్య కూడా 20 శాతం మేర పెరిగినట్లు చెప్పారు. విద్య, అభివృద్ధి, సంబంధిత రంగాలలో ఉభయ దేశాల మధ్య గల అవగాహనకు ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 'అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉండడం మన రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంత దృఢమైనవో సూచిస్తున్నది' అని రోమర్ అన్నారు.
1,03,260 మంది విద్యార్థులలో 15,600 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 71,019 మంది గ్రాడ్యుయేట్లు (మాస్టర్స్, పిహెచ్ డి ప్రోగ్రామ్ లతో సహా), 1755 మంది నాన్ డిగ్రీ విద్యార్థులు 14,886 మంది ఇంటర్న్ షిప్ చేస్తున్నవారు ఉన్నారు. 2007 - 08లో అమెరికాలోని భారతీయ విద్యార్థులలో 13,639 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 68069 మంది గ్రాడ్యుయేట్లు, 979 నాన్ డిగ్రీ విద్యార్థులు, 10,846 మంది ఇంటర్న్ షిప్ విద్యార్థులు ఉన్నారు.
News Posted: 19 November, 2009
|