సంతాన లక్ష్మి మనది! ముంబయి : రానున్న 40 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా ఆవిర్భవించబోతున్నదని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ (యుఎన్ఎఫ్ పిఎ) వెలువరించిన ఒక నివేదిక పేర్కొంది. 2050 నాటికి చైనా 1417 మిలియన్ల మంది ప్రజలతో అధిక జనాభా గల రెండవ దేశం కాగలదు.
ప్రస్తుతం 1345.8 మిలియన్ల మంది ప్రజలతో చైనా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా ఉన్నది. ఇండియా 1198 మిలియన్ల జనాభాతో రెండవ స్థానంలో ఉన్నది. అయితే, 'ఒక కుటుంబం, ఒకే సంతానం' వంటి కఠినమైన కుటుంబ నియంత్రణ చర్యలను చైనా అమలు పరచడం సత్ఫలితాలనే ఇచ్చింది. 2005, 2010 మధ్య ప్రతిపాదిత జనాభా వృద్ధి రేటు 0.6 శాతం మాత్రమే ఉన్నది. కాగా ఇండియాలో జనాభా వృద్ధి రేటు అదే కాలంలో 1.4 శాతం ఉంది.
'మరి 25 సంవత్సరాల పాటు భారతదేశ జనాభా వృద్ధి చెంది ఆతరువాత స్థిరపడుతుంది. అటుపిమ్మట జనాభా రేటు తగ్గుముఖం పట్టవచ్చునని అనుకుంటున్నాం. మన కన్నా చాలా ముందుగానే చైనా జనాభా నియంత్రణ చర్యలు తీసుకుంది' అని యుఎన్ఎఫ్ పిఎ మహారాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ డి.కె. మంగళ్ తెలిపారు.
గడచిన ఐదేళ్లలో ఇండియాలో శిశు మరణాలు చైనా, బ్రెజిల్ దేశాలలో కన్నా రెండింతలకుపైగా ఉన్నాయి. ఇండియాలో ప్రతి వెయ్యి జననాలకు ఐదేళ్లలోపు 85 మంది మగ పిల్లలు, 95 మంది ఆడపిల్లలు మరణించారు. చైనాలో ఇదే కాలంలో 25 మంది బాలురు, 36 మంది బాలికలు, బ్రెజిల్ లో 33 మంది బాలురు, 25 మంది బాలికలు మృతి చెందారని ఈ నివేదిక తెలియజేసింది.
ఇండియాలో గర్భధారణ రేటు 2.44 శాతంగా ఉండగా చైనాలో అంతకన్నా తక్కువగా 1.77 శాతం మేర ఉంది. 'కుటుంబ నియంత్రణ, పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యం గురించిన చైతన్యం పెరగడం, అక్షరాస్యత వంటి అంశాలు కూడా ఈ గర్భధారణ రేటుకు సూచికలుగా ఉంటున్నాయి' అని మంగళ్ పేర్కొన్నారు.
News Posted: 20 November, 2009
|