బిజెపిలో సుష్మా చరిష్మా న్యూఢిల్లీ : వృద్ధనేత అద్వానీకి వారసురాలిగా సుష్మ అవతరిస్తున్నారు. ఎల్.కె. అద్వానీ ప్రతిపక్ష నాయకుని పదవి నుంచి నిష్క్రమించినప్పుడు సుష్మా స్వరాజ్ ఆ పదవిని స్వీకరించే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో కీలక నిర్ణయాలను తోసిరాజనగల (వీటో చేయగల) నేతల (అద్వానీ, పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్) 'సంపూర్ణ' మద్దతు ఆమెకు ఉందని పార్టీ వర్గాలు తెలియజేశాయి.
తన వారసురాలు సుష్మాయేనని, అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకునిగా కొనసాగగలరని అద్వానీ చెప్పినట్లు తెలుస్తున్నది. సుష్మా స్వరాజ్ ప్రస్తుతం లోక్ సభలో ఉప ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న విషయం విదితమే. అద్వానీకి, ఆర్ఎస్ఎస్ కి మధ్య కుదిరిన 'అవగాహన'లో భాగమే ఈ 'ఏర్పాటు'. తన నామినీని బిజెపి అధ్యక్షునిగా పేర్కొనడానికి సంఘ్ ను 'అనుమతించగా' పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులను నామినేట్ చేయడంలో అద్వానీ మాటే చెల్లుబాటు అవుతుంది. సుష్మా, జైట్లీ ఇద్దరూ అద్వానీకి ఆశ్రితులే కదా!
సుష్మాకు బిజెపి అధ్యక్ష పదవి ఇవ్వజూపారని, కాని పార్లమెంటరీ విధులనే ఆమె ఇష్టపడుతున్నందున ఆ ప్రతిపాదనను ఆమె 'తోసిపుచ్చార'ని ఆమె సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. కాగా, 'అద్వానీ మా మధ్యే ఉండగా ఆయన స్థానంలో పదవీ బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచన రావడమే బాధాకరం. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదు. అటువంటి సూచనకు నేను ఆమోదం తెలపలేదు కూడా' అని సుష్మా స్వరాజ్ శుక్రవారం భోపాల్ లో విలేకరులతో చెప్పినట్లు వార్తాసంస్థలు తెలియజేశాయి. ఈ 'ఆఫర్' గురించిన ప్రశ్నకు ఆర్ఎస్ఎస్ ప్రతినిధి ఒకరు సమాధానం ఇస్తూ, 'పార్లమెంట్ లో ఆమె బాగా రాణించారు. ఆమె ఉపన్యాస సామర్థ్యం అందరికీ తెలిసిందే కదా' అని అన్నారు.
బిజెపి అధ్యక్ష పదవికి నితిన గడ్కారి పేరుపై నిర్ణయానికి రావడానికి ముందు తాము జైట్లీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి పేర్లను 'తీవ్రంగా' పరిశీలించామని సంఘ్ వర్గాలు వెల్లడించాయి. కాని, గుజరాత్ ను వదలిపెట్టడానికి మోడి నిరాకరించారు. జైట్లీ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోకపోవడానికి కారణాలు తెలియరాలేదు. బిజెపి నెలకొల్పిన ఒక ఆనవాయితీ ప్రకారం, లోక్ సభలో ప్రతిపక్ష నేత సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి సారథ్యం వహించాలి. ఆవిధంగా ఆ నేత ప్రధాని పదవికి 'సహజంగా' అభ్యర్థి అవుతారు. పార్టీలో సుష్మా విమర్శకులు సైతం ఆమె 'ఆకర్షణ శక్తి' అమోఘమని అంగీకరిస్తారు.
News Posted: 21 November, 2009
|