అగ్ని- 2 విఫలం బాలాసోర్ : అణ్వస్త్ర సామర్థ్యం గల, రాత్రి వేళల్లో శతృ లక్ష్యాలను దెబ్బతీసేందుకు ఉద్దేశించి మొట్టమొదటిసారిగా ప్రయోగించిన మధ్యంతర శ్రేణి క్షిపణి 'అగ్ని - 2' ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయినట్లు తెలుస్తున్నది. ఒరిస్సా భద్రక్ జిల్లా వీలర్స్ ఐలాండ్ లో ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుంచి ఉపరితలం నుంచి ఉపరితలంలో లక్ష్యాలను ఛేదించే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ (ఐఆర్ బిఎం)ను సైన్యం సోమవారం రాత్రి సుమారు 7.50 గంటలకు ప్రయోగించింది. 'పైకి లేవడం, మొదటి దశ వేరు పడడం అనే ప్రక్రియలు సాఫీగా సాగాయి. కాని రెండవ దశ వేరు పడడానికి కొద్దిగా ముందు దానిలో లోపం తలెత్తి నిర్దేశిత మార్గం నుంచి మళ్ళింది. అసలు కారణం తెలుసుకోవడానికి ఇంకా విశ్లేషణ జరుగుతోంది' అని ప్రయోగ కేంద్రం ఒక ప్రతినిధి చెప్పారు.
సోమవారం ప్రయోగానికి సంబంధించిన మొత్తం మార్గాన్ని అత్యధునాతన రాడార్లు, టెలిమెట్రీ పరిశీలక కేంద్రాలు, ఎలక్ట్రో - ఆప్టిక్ సాధనాలు, ఒక నౌకా దళ నౌక పర్యవేక్షించాయి. అసలు ఈ ప్రయోగం ఈ నెల మొదటి వారంలోల జరగవలసి ఉంది.కాని న్యూమాటిక్ వ్యవస్థలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తినందున ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఆ లోపాలను సరిదిద్దినప్పటిీక సోమవారం పరీక్ష సమయంలో మరొక లోపం తలెత్తి ఈ వైఫల్యానికి దారి తీసిందని ఆ ప్రతినిధి వివరించారు.
అణ్వస్త్ర సామర్థ్యం గల ఈ 2000 కిలోమీటర్ల పైచిలుకు శ్రేణి క్షిపణి పొడుగు 20 మీటర్లు, వెడల్పు ఒక మీటర్. దీని బరువు 17 టన్నులు. ఇది సుమారు వెయ్యి కిలోల పేలోడ్ ను తీసుకుపోగలదు. దీనిని మొదటి 1999 ఏప్రిల్ 11న పరీక్షించారు. భారతదేశ వ్యూహాత్మక దృష్టితో చూస్తే ఈ ప్రయోగం ముఖ్యమైనది. ఎందుకంటే రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఒ) క్షిపణుల రూపకల్పన కార్యక్రమాన్ని ప్రారంభించిన దరిమిలా క్షిపణిని రాత్రి పూట ప్రయోగించడం ఇదే మొదటిసారి. సైనికాధికారులు దీని ఉపయోగంపై పరీక్ష జరపగా, డిఆర్ డిఒ సైంటిస్టులు ఇతర సదుపాయాలు కల్పించారు.
News Posted: 24 November, 2009
|