టీచర్లకు తప్పదు: సుప్రీం న్యూఢిల్లీ : ఎన్నికల విధులతో సహా బోధనేతర పనులకు టీచర్లను నియోగించకుండా ప్రభుత్వాలను నిరోధస్తూ తాను లోగడ ఇచ్చిన తీర్పు సంపూర్ణం కాదని సుప్రీం కోర్టు సోమవారం వివరించింది. 'సాధ్యమైనంత వరకు', 'సాధారణంగా' టీచర్లను బోధన రోజుల్లో, వేళల్లో బోధనేతర పనులకు ఉపయోగించరాదని మేము అన్నాం. అయితే, ఏదైనా మారుమూల ప్రాంతంలో మరే అధికారులూ లేనప్పుడు ఎన్నికల కమిషన్ (ఇసి) ఎన్నికలను (టీచర్ల పాత్ర లేకుండా) ఎలా నిర్వహిస్తుంది?' అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొన్నది.
బోధనేతర విధుల నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలలోని ఉపాధ్యాయులను తరచు నియోగించకుండా నిలువరించడానికి గౌహతి హైకోర్టు నిరాకరించిన తరువాత ఒక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ (ఎన్ జిఒ) దాఖలు చేసిన అప్పీల్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
ఇలా బోధనతర విధులకు టీచర్లను నియోగించడం వల్ల 'ఈ పాఠశాలల్లో విద్యా బోధన కార్యక్రమాలకు అంతరాయం కలుగుతున్నది' అని బరక్ మానవ హక్కుల పరిరక్షణ కమిటీ ఆరోపించింది. ఈ విద్యా సంస్థలలో చాలా వరకు అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలని తెలియజేస్తూ ఎన్ జిఒ సాక్ష్యాధారాలను కూడా సమర్పించింది. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలలోని టీచర్లు, పిల్లల సంరక్షకులు, ప్రొఫెషనల్స్, తదితరులతో కూడిన సంస్థ ఈ కమిటీ.
పల్స్ పోలియో ప్రచారోద్యమం, మలేరియా నిర్మూలన కార్యక్రమం, జనాభా లెక్కల సేకరణ, వోటర్ల జాబితా రూపకల్పన, ఇతర ఎన్నికల సంబంధిత పనులకు రాష్ట్ర ప్రభుత్వం టీచర్లను నియోగిస్తున్నదని పిటిషన్ పేర్కొన్నది. సమాజంలో ఉన్నత స్థాయికి చెందిన, పట్టణ ప్రాంతాల వారి పిల్లలకు విద్యాబోధన చేసే ప్రైవేట్ పాఠశాలలో టీచర్లకు ఇటువంటి విధులు ఏవీ అప్పగించడం లేదని కూడా పిటిషన్ ఆరోపించింది. ఫలితంగా, ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లోని టీచర్లు రోజుల తరబడి, కొండొకచే నెలల తరబడి తమ స్కూల్స్కు హాజరు కావడం లేదని, దీనితో పాఠ్యప్రణాళికను పూర్తి చేయలేకపోతున్నారని, విద్యార్థులకు తక్కువ మార్కులు వస్తున్నాయని పిటిషన్ వాదించింది.
News Posted: 24 November, 2009
|