రాష్ట్ర ఆదాయం తగ్గింది హైదరాబాద్ : ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సూచనలు గోచరిస్తున్నప్పటికీ ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా వదలలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2009-10) ప్రథమార్ధంలో ప్రభుత్వ రెవెన్యూ వసూళ్ళలో రూ. 3540 కోట్ల మేర లోటు ఉన్నది. రూ. 24,665 కోట్ల వసూలుకు లక్ష్యం నిర్దేశించుకోగా రూ. 20,925 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇప్పటికే ద్రవ్య లోటును ఎదుర్కొంటున్న రాష్ట్ర ఖజానాపై ఈ లోటు పెను భారాన్నే మోపింది. తన ఉద్యోగులకు వేతనాల చెల్లింపే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధానం.అయితే, ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఒక శాఖలో మాత్రం వృద్ధి కనిపించింది. ఎక్సైజ్ శాఖ తనకు నిర్దేశించిన లక్ష్యం రూ.882 కోట్లు కాగా రూ. 910 కోట్లు వసూలు చేసింది. మాంద్యం ప్రభావం ఏమాత్రం లేకుండా మద్యం అమ్మకాలు పెరగడమే ఇందుకు కారణం.
వాణిజ్య పన్నులు (సిటి), రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్, గనులు, రవాణా శాఖలతో సహా ప్రధాన శాఖలు గడచిన ఆరు నెలలలో తమకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. వాణిజ్య పన్నుల శాఖ రూ. 2400 కోట్ల లక్ష్యానికి రూ. 1930 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెవెన్యూ శాఖ రూ. 650 కోట్ల లక్ష్యానికి రూ. 420 కోట్లు, రవాణా శాఖ రూ. 293 కోట్లకు రూ. 225 కోట్లు వసూలు చేశాయి. ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రూ. 260 కోట్ల లక్ష్యానికి రూ. 192 కోట్లు, గనుల శాఖ రూ. 194 కోట్లకు రూ. 164 కోట్లు వసూలు చేశాయి.
ప్రజలకు చేతిలో డబ్బు ఎక్కువగా లేకపోవడంతో ఖర్చులు తగ్గించుకున్నారని, దీనితో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం తగ్గిందని అధికారులు వివరించారు. అయితే, ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తున్నది. మాంద్యం ప్రభావాన్ని అధిగమించడం కష్టమైనప్పటికీ లోపాలను అరికట్టి రెవెన్యూ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 43,578 కోట్ల వార్షిక రెవెన్యూ లక్ష్యాన్ని తాము సాధించగలమని అధికారులు ముఖ్యమంత్రితో చెప్పారు. కాని వారు నమ్మకంతో ఈ హామీ ఇచ్చినట్లు కనిపించడం లేదు.
News Posted: 25 November, 2009
|