కథలు చదివితే మార్కులు న్యూఢిల్లీ : హాయిగా కథలూ, సీరియళ్లు, డిటెక్టీవ్ నవళ్లు, కవిత్వం చదువుకోండి. స్కూలు పుస్తకాలు పక్కన పెట్టేసినా ఫర్వాలేదు. మార్కులు పడతాయి. కన్యాశుల్కం నాటకంలో వెంకటేశానికి చుట్ట కాల్చడం నేర్పిందెవరో, తులసిదళం నవల్లో సాహూ ఏం చేసేవాడో, డిటెక్టివ్ యుగంధర్, షాడో, శ్రీకర్, బిందు బృందం సాగించిన సాహసాలు ఎలాంటివో... వగైరా వగైరా పరిజ్ఞానం కూడా మీకు పాఠశాల్లో మార్కులు వచ్చేలా చేస్తాయి. ఈ మహదవకాశం త్వరలో కలగనున్నది. పాఠశాలల్లో విద్యార్థులు పాఠాలను బట్టీయం దశ నుంచి మరింత మెరుగ్గా వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్ర విద్యా మండలి కొత్త ఆలోచనలను చేస్తోంది.
పూర్వం పిల్లలు స్కూలు పుస్తకాలు కాకుండా నవలలు, కథలు, వారపత్రికల చదివితే తల్లితండ్రులు వీపు చీరేసేవారు. కథలు కూడెడతాయా? సన్నాసి. బుద్దిగా స్కూలు బుక్కులు చదువుకో అని సుద్దులు చెప్పేవారు. ఇప్పుడు పరిస్థితి రివర్సులో నడుస్తోంది. పిల్లలకు సాహిత్యం చదవే అలవాటు పోవడంతో అసలు ప్రపంచం గురించే తెలియడం లేదని సామాజిక వేత్తలు, విద్యావేత్తలు వాపోతున్నారు. జీవితంలో పాఠాలు ఒక్కటే ప్రధానం కాదని అన్నిరకాల సాహిత్యం, చరిత్ర, పురాణాలు చదవడం వలన ప్రపంచ జ్ఞానం వస్తుందని చెబుతున్నారు. అందుకే విద్యార్ధులు కేవలం పాఠ్యపుస్తకాను మాత్రమే కాక కాల్పనిక సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించడానికి ఒక కొత్త ప్రాజెక్టును కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సిబిఎస్ఇ) ప్రవేశపెట్టనున్నది. ఈ ప్రాజెక్టు కింద విద్యార్థులకు కొత్త పాపులర్ కథ లేదా నవల పఠనానికి పాయింట్లు కేటాయిస్తారు. మార్కులు వస్తాయనే కారణంతో కాకుండా సరదా కోసం పుస్తకాలు చదివేట్లుగా విద్యార్థులను ఇది ప్రోత్సహించగలదని ఆశిస్తున్నారు.
పాఠాలు బట్టీ పెట్టే అలవాటును తప్పించి, ప్రతి వారం లైబ్రరీ పీరియడ్లు నిర్ణయించాలని, విద్యార్థులు తాము కోరుకున్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి చదివేలా ప్రోత్సహించాలని పాఠశాలలను కోరుతూ సిబిఎస్ఇ క్రితం వారం ఒక ఉత్తర్వు పంపింది. ఈ ప్రాజెక్టు సిబిఎస్ఇకి అనుబంధితమైన పది వేల పాఠశాలల్లో అనుసరిస్తున్న 'నిరంతర, సమగ్ర మదింపు' (సిసిఇ) విధానంలో భాగం కాగలదు. దీని కింద విద్యార్థులు ప్రతి టెర్మ్ లో కనీసం ఒక పాపులర్ రచయిత కథను లేదా నవలను చదవవలసి ఉంటుంది.
సామూహిక చర్చలు, గ్రాఫిక్ నవలల సృష్టి, కథ చెప్పడం వంటి వినూత్న పద్ధతుల ద్వారా విద్యార్థుల గ్రాహ్య శక్తిని మదింపు వేస్తారు. అయితే, బుక్ రిపోర్టులు రాయవలసిందిగా వారిని కోరరు. ఎందుకంటే దీని వల్ల వారికి పూర్తిగా ఆసక్తి నశించవచ్చు. 'సాహితీ కార్యక్రమాలు గ్రాఫిక్ నవలల సృష్టి, కథను నిశితంగా మదింపు వేయడం, రచయితతో ముఖాముఖి వంటి కార్యకలాపాలను మేము సూచించాం' అని పేరు వెల్లడి చేయడానికి ఇష్టపడని సిబిఎస్ఇ అధికారి ఒకరు తెలియజేశారు. మీడియాతో మాట్లాడేందుకు ఆయనకు అధికారం ఇవ్వలేదు. 'దీని వల్ల విద్యార్థి చదవడంపై తిరిగి ఇష్టం పెంచుకోవచ్చునని మా విశ్వాసం' అని ఆయన చెప్పారు.
కాగా, 5, 6, 7 తరగతులకు ఎనిడ్ బ్లైటన్, రోల్డ్ దహల్ రచనలు, పంచతంత్రం, 8, 9 తరగతులకు జె.కె. రౌలింగ్, జూల్స్ వెర్న్ రచనలు, 10వ తరగతి, ఆపై తరగతులకు అగాథా క్రిస్టీ, చార్లెస్ డికెన్స్, జార్జి ఆర్వెల్, సత్యజిత్ రే, ఆర్.కె. నారాయణన్ మొదలైన వారి రచనలను సిబిఎస్ఇ సిఫార్సు చేసింది.
News Posted: 25 November, 2009
|