'వాజపేయిని తప్పు పట్టలేదే' న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేతకు దారి తీసిన పరిస్థితులపై తాను సమర్పించి నివేదికలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయిని అయోధ్య ఉద్యమ కాలంలో బిజెపి అగ్ర నాయకునిగా 'బూటకపు మధ్యేవాది'గా పాత్ర పోషించినందుకు తాను తప్పు పట్టలేదని జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ మంగళవారం స్పష్టం చేశారు. 'బూటకపు మధ్యేవాదులు'గా ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో వాజపేయిని జత కలిపిన తరువాత లిబర్హాన్ కమిషన్ తన నివేదికలో 'ఈ బూటకపు మధ్యేవాదులు చేసిన తప్పులకు వీరిని గర్హించడానికి వెనుకాడడం లేదు' అని పేర్కొన్నది.
కమిషన్ ముందు హాజరు కావలసిందిగా ఎన్నడూ పిలవని వాజపేయిని 1952 నాటి దర్యాప్తు కమిషన్ చట్టంలోని 8బి సెక్షన్ ను ఉల్లంఘిస్తూ ఎలా తప్పు పట్టగలరని చండీగఢ్ లో ఉన్న జస్టిస్ లిబర్హాన్ ను ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం ఇస్తూ, మాజీ ప్రధానిని తాను ఎన్నడూ తప్పు పట్టలేదని చెప్పారు. 'నివేదికను ఒకసారి చదవండి. వాజపేయిని తప్పు పట్టినట్లుగా భావించే ఏదైనా ప్రస్తావన ఒక్కటి ఉన్నా నాకు చూపండి' అని ఆయన అన్నారు. తన నివేదికలో నుంచి బాధ్యతారహితంగా ప్రస్తావనలు చేయవద్దని లిబర్హాన్ విజ్ఞప్తి చేశారు.
మనిషి పరోక్షంలో దోషిగా పేర్కొనడాన్ని 8బి సెక్షన్ నిషేధిస్తున్నదని గుర్తు చేయగా, 'నా నివేదికలో భాగాన్ని వాజపేయిని తప్పు పట్టడంగా పరిగణిస్తున్నవారు నివేదికను అపార్థం చేసుకుంటున్నారు. దానిని అసలు అర్థంలో చదవడం లేదు. ఈ చట్టంలో 8బి సెక్షన్ లో కావలసిందేమిటో నాకు బాగా తెలుసు' అని లిబర్హాన్ పేర్కొన్నారు. నివేదికలోని 942 పేజీలో కమిషన్ ఇలా పేర్కొన్నది: 'ఎల్.కె. అద్వానీకి, ఎ.బి. వాజపేయికి లేదా ఎం.ఎం. జోషికి సంఘ్ పరివార్ పథకాలు తెలియవని కనీసం ఒక్క క్షణం కూడా భావించలేము.... బూటకపు మధ్యేవాదులగా పేర్కొనదగిన ఈ వ్యక్తులు బిజెపి నాయకులుగా ప్రజా జీవితం నుంచి తప్పుకోకుండానే సంఘ్ పరివార్ ఆదేశాన్ని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ ఆదేశాన్ని ఉల్లంఘించి ఉండకపోవచ్చు'.
'అయితే, ఈ నాయకులకు సంశయ లాభం ఇచ్చి, దోషులు కారని చెప్పజాలం... ఈ నాయకులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. వీరి వ్యవహరణ వోటర్లు చెప్పినట్లుగా కాకుండా, కొంత మంది వ్యక్తుల సమూహం ఆదేశానికి తలొగ్గినట్లుగా ఉంది. సామాన్య ప్రజలు అనుమతించని అజెండాల అమలుకు వీరిని ఆ సమూహం ఉపయోగించుకున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతకన్నా నమ్మక ద్రోహం లేదా నేరం ఉండజాలదు. ఈ బూటకపు మధ్యేవాదులను వీరి తప్పులకు గర్హించడంలో ఈ కమిషన్ వెనుకాడడం లేదు' అని కూడా నివేదిక పేర్కొన్నది.
News Posted: 25 November, 2009
|