ర్యాగింగ్ మహా నేరం: ప్రతిభ పణజి : ర్యాగింగ్ కు పాల్పడవద్దని విద్యార్థులకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉద్బోధించారు. ఇది 'మానవాళిపై నేరం' అవుతుందని ఆమె అన్నారు. మంగళవారం పణజిలో గోవా విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈ ఉద్బోధ చేశారు. ఈ స్నాతకోత్సవంలో ప్రతిభా పాటిల్ 'డాక్టర్ ఆఫ్ లెటర్స్' (డిలిట్) గౌరవ డిగ్రీని ప్రదానం చేశారు.
'మన దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలలో ర్యాగింగ్ కు స్వస్తి చెప్పాలి. ఇది మానవాళి పట్ల నేరమే. సిగ్గుచేటైన ప్రవర్తన. సంస్కారవంతమైన దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని విద్య పెంపొందించాలి. అలా కానిచో జీవితానికి, దాని వాతావరణానికి ఉపయోగపడదు' అని ప్రతిభా పాటిల్ అన్నారు. కామర్స్, మేనేజ్ మెంట్ వంటి 'అధికాదరణ కలిగిన' సబ్జెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపవద్దని, విశ్వవిద్యాలయ స్థాయిలో సమాన ప్రాముఖ్యం గల బేసిక్ సైన్స్ సబ్జెక్టులను చదివి, పరిశోధనపైన, వినూత్న సృష్టిపైన దృష్టి కేంద్రీకరించాలని కూడా విద్యార్థులను రాష్ట్రపతి కోరారు.
'54 కోట్ల మంది యువజనులతో ఇండియా ప్రపంచంలో అత్యధికంగా యువత జనాభా ఉన్న దేశాలలో ఒకటి. వారికి సరైన విద్య అందేలా చూడడం మన బాధ్యత' అని ఆమె చెప్పారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిభా పాటిల్ కోరారు. 'మాదకద్రవ్యాలకు అలవాటు పడడం మన యువతకు ప్రమాదకారిగా పరిణమిస్తున్నది. ముందు మీరు మాదకద్రవ్యాన్ని సేవిస్తారని, ఆతరువాత అది మిమ్మల్ని సేవిస్తుందని చెబుతుంటారు. దీని దుష్ప్రభావాల గురించి అందరినీ చైతన్యవంతం చేయగలరని నా ఆశ' అని ప్రతిభా పాటిల్ చెప్పారు.
విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా జాబ్ మార్కెట్ అవసరాలను ముందుగానే మదింపు వేసి తదనుగుణంగా కోర్సులకు రూపకల్పన చేయాలని విశ్వవిద్యాలయాలను రాష్ట్రపతి కోరారు. 'ఇండియాలో ఉద్యోగం కన్నా కూడా ఉద్యోగ సామర్థ్యమే ఎక్కువ సమస్యగా ఉన్నది. అంటే జనానికి ఉన్న నైపుణ్యం ఉద్యోగం సంపాందించేందుకు సరిపోవడం లేదన్నమాట' అని ఆమె అన్నారు.
అంతకుముందు గోవా గవర్నర్, విశ్వవిద్యాలయం చాన్స్ లర్ ఎస్.ఎస్. సిద్ధు సమాజంలో బడుగు వర్గాల అభ్యున్నతిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించినందుకు ప్రతిభా పాటిల్ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వివిధ ఫ్యాకల్టీలలో 32 మంది విద్యార్థులకు పిహెచ్ డి డిగ్రీలను, 376మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాస్టర్స్ డిగ్రీలను ప్రదానం చేశారు.
News Posted: 25 November, 2009
|