కోట్లు మింగుతున్న కసబ్ ముంబయి : వందల మంది ప్రాణాలను బలితీసుకోవడానికి రాక్షస మృత్యక్రీడకు తెగబడి, రక్తపాతం సృష్టించిన పాకిస్తాన్ ఉగ్రవాదుల శవాలను భద్రపరచడానికి, ప్రాణాలతో పట్టుబడిన నరరూప యమకింకరుడు అజ్మల్ కసబ్ ను జైలులో ఆరోగ్యంగా ఉంచడానికి భారత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా? ఒక్కసారి ఊపిరిబిగపట్టండి. అక్షరాలా యాభైఅయిదు కోట్ల రూపాయలు. దీనిలో దాడిలో చనిపోయిన తొమ్మిది మంది ఉగ్రవాదులను మార్చురీలో, శవాలు కుళ్ళిపోకుండా దాచడానికి సుమారు 22 కోట్ల రూపాయలను, కసబ్ కోసం ఇప్పటికి 31 కోట్ల రూపాయలను ఖర్చు చేసారు.
సంవత్సరం క్రితం ముంబయి వీధుల్లో పాకిస్తాన్ ముష్కరులకు, ముంబయి పోలీసు వీరులకు మధ్య జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులు చనిపోయారు. హేమంత్ కర్కరే, విజయ్ సలాస్కర్, కామ్టే లాంటి మేటి పోలీసు అధికారులు ప్రాణాలు పొగొట్టుకున్నారు. కానీ ఆరోజు చనిపోయిన పోలీసు అధికారులను రోడ్లపైనే వదిలేసిన మన ఘనులు, తీవ్రవాదుల శవాలను మాత్రం హుటాహుటీన ఆసుపత్రిలకు తరలించారన్న నమ్మలేని నిజాన్ని కర్కరే సతీమణి బయటపెట్టారు. దాడిలో పాల్గొంటున్న వారికి అధికారులు ఎలాంటి్ సహాయాన్ని పంపించలేదని కామ్టే భార్య ప్రభుత్వాన్ని ఇప్పుడు నిలదీస్తున్నారు. చచ్చిపోయిన ముష్కరుల శవాలను దాచడానికి 22 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి, వందలాది మంది పోలీసులను శవాలకు కాపలాగా పెట్టిన ఈ ప్రభుత్వం కర్కరే ధరించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆచూకీని కనిపెట్టలేకపోవడం సిగ్గు చేటు కాదా అని కర్కరే సతీమణి ప్రశ్నించారు. ఈ ధీరవనితలు ప్రశ్నిస్తేనే గానీ ప్రభుత్వం తన తప్పిదాలను ఒప్పుకోలేకపోయింది. చివరకు కేంద్ర హోం మంత్రి చిదంబరం ముంబయి దాడి సందర్భంగా జరిగిన తప్పిదాలను అంగీకరించి తలవంచుకుని ఈ మహిళామణులుకు క్షమాపణలు చెప్పారు. ఇదంతా జరగడానికి మన దేశంలో సంవత్సర కాలం పట్టింది.
ప్రాణాలతో పట్టుబడిన కసబ్ ఒక్కడే ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని ప్రపంచానికి చెప్పటానికి భారత్ కు దొరికిన సజీవ సాక్ష్యం. ఉగ్రవాదానికి పాకిస్తాన్ అండదండలున్నాయన్న నగ్నసత్యాన్ని నిరూపించడానికి కసబ్ ఆయుధంగా చిక్కాడు. దాంతో ఈ 21 ఏళ్ల ఉగ్రవాదిని ఆరోగ్యంగా ఉంచడానికి, దేశద్రోహుల నుంచి అతనిని రక్షించడానికి ప్రభుత్వం ఇప్పటి వరకూ 31 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. సర్ ఆర్థర్ రోడ్ జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో కసబ్ పై విచారణ గత మే నెలలో ప్రారంభం అయింది. అది ఇంకా పూర్తి కాలేదు. కనీసం మరో మూడు నెలలు సాగుతుందని అంచనా. కసబ్ ను క్షేమంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు దాదాపు 85 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఇతని కోసం జైలులో దుర్భేద్యమైన ప్రత్యక గదిని సుమారు కోటి రూపాయలు పెట్టి కట్టించారు. ఇదెంత గట్టిదంటే ట్రక్కుడు బాంబులతో దీనిని కొట్టినా చెక్కుచెదరదని ఒక అధికారి వెల్లడించారు. జైలు మొత్తానికి ఇరవై నాలుగుగంటలూ ప్రత్యేక దళాల పహారాను ఏర్పాటు చేశారు. కసబ్ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి వైద్యులు జెలులోనే అందుబాటులో ఉంటారు. కసబ్ వ్యవహారం ఖరైదైనదే అయినా మరో మార్గం లేదని అధికారులు చెబుతున్నారు.
News Posted: 26 November, 2009
|