బాబు 'ఎస్ఎంఎస్' వార్ హైదరాబాద్ : జంటనగరాలకు అదనంగా హైటెక్ సిటీని నిర్మించి ట్రైసిటీగా మార్చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుదే. ఆ విషయం అయనే గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రతీ పనిలో హైటెక్ ను వాడాలనేది ఆయన సిద్దాంతం కాబోలు. డ్రైవింగ్ లైసెన్సును హైటెక్ పద్ధతిలో ఇచ్చి అలనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ చేతే ఔరా అనిపించిన ఘనుడాయన. ఏదైనా హైటెక్ పద్ధతిలోనే చేయడం చంద్రబాబు స్టైల్. రాజకీయాల్లో కూడా అదే బాట. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్ధుల ప్రచారానికి సెల్ ఫోన్ల ను విరివిగా ఉపయోగించుకున్నారు. టెక్ట్స్ మెసేజ్ లు, వాయిస్ మెసేజ్ (ఎస్ఎంఎస్)ల ద్వారా తెలుగుదేశం విధానాలను చెబుతూ ఓటేయని కోరారు. ఇప్పుడు మరో ముందడుగు వేశారు. సెల్ ఫోన్ లో తన పార్టీ ప్రచారం కంటే ప్రత్యర్ధి పార్టీల తప్పులను మెసేజ్ ల రూపంలో ఇప్పించారు. ఫలానా అభ్యర్ధి ఫలానా చోట డబ్బులు పంచుతూ దొరికిపోయారని, ఫలానా పార్టీ వారిన పోలీసులు అరెస్టు చేశారని ఇత్యాదివి అన్నమాట.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ హైటెక్ ప్రచారం హల్ చల్ కొనసాగించింది. ఓటర్లకే కాదు ఎప్పటికప్పుడు మీడియా ప్రతినిధులకు కూడా ఇలాంటి మెస్సేజ్ లు పంపించింది. ఏక్కడో పోలీసులు ఏదో పార్టీ వాహనాన్ని ప్రచార సామాగ్రితో స్వాధీనం చేసుకున్నారని, ఫలానా పోలీసు స్టేషన్ లో వివరాలు లభిస్తాయని, వార్త రాయాలని కోరుతూ తెలుగుదేశం హైటెక్ ప్రచారం విభాగం మెస్సేజ్ లు పంపించింది. ఇది కేవలం హైటెక్ ప్రచారంలో ప్రారంభం మాత్రమేనని, త్వరలో టివి చానెళ్ళకు వీడియో టేపులు కూడా అందచేస్తామని ఆ విభాగం ప్రతినిధులు వివరించారు. ఇతర పార్టీల తప్పిదాలను, పాల్పడే అక్రమాలను బయటపెట్టడంపైనే తెలుగుదేశం దృష్టి పెట్టిందని తెలిపారు.
హైటెక్ పద్దతులను వాడటం తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కొత్తకాదని, ఎన్టీఆర్ హయాం నుంచే దీనికి శ్రీకారం చుట్టారని వారు చెబుతున్నారు. కేసేట్ రికార్డింగ్ ద్వారా ప్రచారం సాగించిన మొదటి పార్టీ తెలుగుదేశమేనని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పార్టీ కార్యకలాపాలాకు విస్తృత ప్రచారం కల్పించడమే దీని ముఖ్యోద్దేశమని వారు పేర్కొన్నారు. అలానే తెలుగుదేశం పార్టీ లో ప్రెస్ రిలేషన్స్ చూసే వ్యక్తుల పనితీరును పత్రికల్లో, టీవీల్లో వచ్చే కవరేజీపై ఆధారపడి చంద్రబాబు అంచనా వేస్తారని, దాంతో ఆవిభాగం ఎస్ఎంఎస్ లతో విలేకర్ల వెంటపడుతున్నారని మరో ప్రముఖుడు తెలిపారు.
News Posted: 27 November, 2009
|