అరకోటి మేక న్యూఢిల్లీ : కేవలం 21 నెలల వయసే. అయితేనేం అప్పుడే 'సూపర్ స్టార్'. ఖుషీ ని దాని యజమాని సూపర్ స్టార్ అనే పిలుస్తాడు. అదేమన్నా ఆకులూ ఆలమలూ తినే ఆషామాషీ మేకా మరి. పవిత్రమైన మేషం ఆయే. నల్లని మేక వంటిపై తెల్లని మచ్చలు ఉన్నాయి. అలా అని దాన్ని తెల్లబట్టమేక అనేయకండి. ఆ తెల్లని మచ్చలు ఎలా ఉన్నాయంటే ముస్లీంలు పరమ పవిత్రంగా భావించే 786 ను పోలి ఉన్నాయి. దీనిని బక్రీడ్ సందర్భంగా ఢిల్లీలో అమ్మకానికి పెట్టాడు ఖుషీ యజమాని జితేందర్ సింగ్. ఖుషీని 21 లక్షల రూపాయలకు అడిగారని, కానీ తను కనీసం అరకోటి రూపాయలు ఇస్తేనే గాని అమ్మబోనని చెబుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు అదృష్టంగా భావించే 786 సంఖ్య అరబిక్ భాషలో ఉండటమే కాదు మరో పక్కన ముస్లీంల పవిత్ర చిహ్నం అర్ధచంద్రాకారం కూడా ఉంది. ఈ గుర్తులు మేక జన్మించినప్పటి నుంచి ఉన్నాయని జితేందర్ చెబుతున్నాడు.
రాజస్థాన్ లోని ఝున్ ఝును గ్రామంలో జితేందర్ పశువుల పెంపకం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఖుషీ కి ఆరు మాసాల వయస్సప్పుడు దానిని మాంసం వ్యాపారి అయిన ముస్లీం కు అమ్మజూపాడు. ఖుషీ ప్రాణాలు తీసే ముందు ఆ వ్యాపారి దాని వంటిపై అరబిక్ భాషలో ఉన్నగుర్తులను గమనించి పవిత్రమైన ఆ జంతువును చంపడానికి నిరాకరించి జితేందర్ కు తిరిగి ఇచ్చేశాడు. అప్పటి నుంచి దానిని జితేందర్ కంటికి రెప్పలా పెంచుకుంటూ వస్తున్నాడు. ఏదో ఒక రోజున దీనిని అమ్మేస్తానని తెలుసు. కానీ అంతవరకూ దానిని ప్రేమగానే చూడాలనుకున్నానని జితేందర్ వివరించాడు. గత యేడాది కూడా ఈ మేకను తీసుకుని జామా మసీదు దగ్గరకు వచ్చానని, అప్పుడు దానిని 5 లక్షల 15 వేల రూపాయలకు అడిగారని, కానీ తాను అమ్మలేదని, ఈ యేడాది 51 లక్షలు రూపాయలైనా వస్తాయని ఆశిస్తున్నానని చెప్పాడు.
ఇంత ఖరీదైన ప్రాణిని పట్టుకుని ఢిల్లీలో సంచరించడం క్షేమం కాదని భావించిన జితేందర్ సింగ్ ఖుషీని ఎక్కడ ఉంచాడో చెప్పడం లేదు. తమ గ్రామానికి చెందిన కొంతమంది ఇక్కడ ఉన్నారని వారి సహాయంతో మేకను సురక్షితంగా ఉంచానని ఆయన వివరించాడు. మొత్తానికి జితేందర్ నిరీక్షణ సగం ఫలించింది. ఖుషీకి 21 లక్షల రూపాయల రేటు పలికింది. శనివారం రాత్రి వరకూ వేచి చూస్తానని తెలిపాడు. జమా మసీదు దగ్గర ఖుషీ సంచలనమే సృష్టిస్తోంది. వందలాది మంది ప్రతీరోజూ దాని చుట్టూ గుమిగూడుతున్నారు. వింతను ఆశ్చర్యంగా చూస్తున్నారు. జితేందర్ సింగ్ మేకను అమ్మేస్తే వచ్చే పెద్ద మొత్తానికి రక్షణగా రాజస్థాన్ పోలీసులు వచ్చారన్న వదంతులు కూడా వ్యాపించాయి. అవన్నీ వట్టిదేనని, డబ్బును ఎలా తీసుకువెళ్లాలో చెప్పే స్నేహితులు ఉన్నారని వివరించాడు.
News Posted: 28 November, 2009
|