ముంచుకొస్తున్న ముప్పు న్యూఢిల్లీ : కొన్నాళ్లకో, కొన్నేళ్లకో ముంబయి, చైన్నై , కోల్ కతా లాంటి మహానగరాలు మాయం అయిపోవచ్చు. సాగర గర్భంలోకి శాశ్వతంగా జారిపోవచ్చు. ఈ ముప్పు ముంచుకు వస్తోంది. భారత దేశ తీర ప్రాంత నగరాలకు జలప్రళయం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ శతాబ్దాంతానికల్లా సముద్ర మట్టాలు 1.4 మీటర్ల మేర (4 అడుగులకు పైగా) పెరిగే అవకాశం ఉంది. పర్యావరణ మార్పులపై డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగన్ లో అంతర్జాతీయ మహాసభ ప్రారంభం కావడానికి కొన్ని రోజులు ముందు వంద మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక ప్రధాన అధ్యయనంలో ఈ నిజం బయటపడింది. 2007 సంవత్సరానికి సంబంధించిన ఐపిసిసి నాలుగవ మదింపు నివేదికలో సూచించిన స్థాయికి ఇది రెట్టింపు.
ఈ జోస్యాలే నిజమైన పక్షంలో, మాల్దీవులు వంటి పల్లంలో ఉన్న ద్వీప దేశాలలో అత్యధిక ప్రాంతాలు సముద్ర గర్భంలో కలసిపోతాయి. లోగడ జరిపిన అధ్యయనాల ఆధారంగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ నిపుణుల బృందం 2100 సంవత్సరానికల్లా మాల్దీవులను నివాసానికి వీలు కానిదిగా చేయగలిగేంత ఎత్తుకు సముద్ర మట్టాలు పెరగగలవని ఇప్పటికే హెచ్చరించింది. ఈ కొత్త అధ్యయనం ప్రకారం భారతదేశంలో తీర ప్రాంతాలకు, చెన్నై, ముంబై నగరాలకు, పల్లపు ప్రాంతమైన కోలకతాకు గణనీయ స్థాయిలో ముప్పు పెరగవచ్చు. అంటార్కిటిక్ పరిశోధనకు సంబంధించిన వైజ్ఞానిక కమిటీ (ఎస్ సిఎఆర్) విడుదల చేసిన ఈ నివేదిక అంటార్కిటికాపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని సమగ్రంగా సమీక్షిస్తూ తొలిసారిగా రూపొందించినట్టిది.
News Posted: 2 December, 2009
|