త్వరలో 11 నంబర్ల సెల్ న్యూఢిల్లీ : సెల్ ఫోన్ నంబరింగ్ ప్లాన్ ను మార్చాలన్న టెలికామ్ శాఖ (డిఒటి) ప్రతిపాదన అమలులోకి వచ్చిన పక్షంలో త్వరలో ఎవరి సెల్ ఫోన్ కైనా 11 అంకెల నంబర్ తప్పనిసరి అవుతుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, 2010 జనవరి 1 నుంచి ప్రస్తుత 10 అంకెల నంబరింగ్ ప్లాన్ ను 11 అంకెల నంబరింగ్ ప్లాన్ కు మార్చాలని డిఒటి ఉద్దేశం. సర్వీస్ ప్రొవైడర్లు ప్రస్తుత నంబర్లకు ముందు 9 అంకె చేర్చాలని డిఒటి కోరుతున్నది.
ఈ విషయమై మీడియా ప్రతినిధులు సంప్రదించినప్పుడు మొబైల్ ఆపరేటర్లు తమకు ఎటువంటి ఆదేశాలూ అందలేదని స్పష్టం చేశారు. అయితే, ఆపరేటర్లందరికీ, పరిశ్రమ సంస్థలు సిఒఎఐ, ఎయుఎస్ పిఐలకు, ట్రాయికి ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తున్నది.
ఈ చర్య వల్ల నంబరింగ్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. దేశంలో మొబైల్ మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుండడాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ పథకానికి గల ప్రాముఖ్యం విదితం కాగలదు. ప్రస్తుతం దేశంలో 500 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వీరి సంఖ్య 2014 నాటికల్లా ఒక బిలియన్ స్థాయికి చేరుకోగలదని అంచనా.
కాకపోతే, వినియోగదారులకు ఈ కొత్త నంబరింగ్ ప్రణాళిక వల్ల ఫోన్ బుక్ లను అప్ డేట్ చేసుకోవడం ఒక సవాల్ కాగలదు. వినియోగదారులు తమ ఫోన్ లో ప్రతి మొబైల్ నంబర్ కు ముందు 9 అంకెను విధిగా చేర్చవలసి ఉంటుంది. ఆటోమేటిక్ అప్ డేట్ సౌకర్యాన్ని సాఫ్ట్ వేర్ కల్పించినప్పటికీ, ప్రతి వినియోగదారుని వ్యక్తిగత ఫోన్ కాంటాక్టులో కోసం లాండ్ లైన్ నంబర్లకు కూడా ముందు 9 అంకెను చేర్చవలసి ఉంటుంది. ఇది అసౌకర్యం కూడా.
ముందు నిర్దేశించిన గడువు ఒక సవాల్ కావచ్చు కాని ఆపరేటర్లు అందరూ అత్యధునాతన స్విచ్ లు ఉపయోగిస్తున్నందున కనీస వ్యయంతో లేదా సాంకేతికపరమైన స్వల్ప ఇబ్బందులతో ఈ నంబరింగ్ ప్రణాళికను మార్చవచ్చునని ఒక ఆపరేటర్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) విలేఖరితో చెప్పారు.
సాధారణంగా ఇటువంటి చర్యకు పరిశ్రమ ప్రతినిధులతో విస్తృతంగా సంప్రదింపులు జరపవలసిన అవసరం ఉంటుంది. అందువల్ల తుది చర్య గైకొనే ముందు పరిశ్రమతో మరింతగా సంప్రదింపులు జరిపే అవకాశం లేకపోలేదు. అయితే, వినియోగదారుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్నందున ఆ సమస్యను కూడా అధిగమించవలసి ఉన్న దృష్ట్యా 2010 జనవరికల్లా అదనపు సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలా అనేదే ప్రశ్న.
News Posted: 2 December, 2009
|