ముకేష్ ఆశకు నేవీ లంగరు! ముంబై : అపర కుబేరుడు, దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఆశపై భారత నౌకాదళం నీళ్లు చల్లింది. తన ఇంటి టెర్రస్ పై నుంచే హెలికాప్టర్ లో ఎగిరిపోవాలన్న ఆయన ఆలోచనకు లంగరు వేసింది. దక్షిణ ముంబై కఫె పెరేడ్ ప్రాంతంలోని తన నివాస భవనం 'సీ విండ్' పైభాగంలో నిర్మించిన హెలిప్యాడ్ నుంచి తన హెలికాప్టర్ లో ఎగరాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ కల అలా అలలపై కొట్టుకుపోయింది. దక్షిణ ముంబైలో నివాస ప్రాంతాల నుంచి విమానాలు, హెలికాప్టర్ల సర్వీసుల నిర్వహణకు అనుమతిని ఇచ్చే ప్రసక్తి లేదని పశ్చిమ నౌకాదళం (డబ్ల్యుఎన్ సి) బుధవారం నిర్ద్వంద్వంగా ప్రకటించింది.
హెలిప్యాడ్ నిర్మించుకోవచ్చునని అంబానీకి మహారాష్ట్ర ప్రభుత్వం, నగర కార్పొరేషన్ అనుమతి ఇచ్చినప్పటికీ, ఆ పరిసరాలలో నౌకాదళానికి చెందిన కీలక కేంద్రాలు ఉన్నాయని, వాటి భద్రతకు ప్రైవేట్ హెలిపాడ్ ముప్పు కలిగించవచ్చని నౌకాదళం పేర్కొన్నది. తమ అజమాయిషీకి ఏమాత్రం అవకాశం లేని లాండింగ్ సౌకర్యం విషయమై రిస్క్ తీసుకోవడానికి అధికారులు సిద్ధంగా లేరు.
'హెలికాప్టర్ సర్వీసుల కోసం సీ విండ్ కు నౌకా దళం అనుమతి ఇచ్చే ప్రసక్తి ఏమాత్రం లేదు' అని వెస్ట్రన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ - ఇన్ - చీఫ్ వైస్ అడ్మిరల్ సంజీవ్ భాసిన్ స్పష్టం చేశారు. నివాసం ప్రాంతంలో హెలిప్యాడ్ నిర్వహణ సురక్షితమైనది కాదని భాసిన్ అన్నారు. ఉగ్రవాదుల నుంచి ఎదురయ్యే ముప్పుపై ప్రశ్నకు భాసిన్ సమాధానం ఇస్తూ, 'అపార్ట్ మెంట్ చుట్టుపక్కల గల నివాస భవనాల సముదాయాలకు దాని నుంచి తీవ్ర ముప్పు ఎదురవుతుంది' అని సూచించారు.
తాజ్ వెల్లింగ్టన్ మ్యూస్ నుంచి తన హెలికాప్టర్ ను బయలుదేరదీయించడానికి రతన్ టాటాకు ఇదివరకే ఇచ్చిన అనుమతిపై కూడా పునఃపరిశీలన జరుపుతున్నారు. 'శాంతాక్రుజ్ విమానాశ్రయం నుంచి కొలబాకు తన ప్రైవేట్ హెలికాప్టర్ లో ప్రయాణించేందుకు రతన్ టాటాకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని నౌకా దళం కోరింది' అని భాసిన్ తెలియజేశారు.
News Posted: 3 December, 2009
|