ఆర్మీ రైఫిల్స్ అమ్మేశారు న్యూఢిల్లీ : భరతమాత రక్షణ కోసం సైన్యంలో పనిచేస్తున్న వారే ఇప్పుడు అక్రమ మార్గం పట్టారు. సైనికోద్యోగులుగా తమకు లభించే ఆయుధాలను వాళ్లు బ్లాక్ మార్కెట్ లో అమ్మేశారు. ఇలాంటి నేరానికి పాల్పడిన 41 మంది పదాతి దళం(ఆర్మీ) సైనికాధికారులను, మరో నలుగు మాజీలను అధికారులు పట్టుకున్నారు. రాజస్థాన్ లోని సరిహద్దు జిల్లాలలో తమ 'నాన్ సర్వీస్ పాటర్న్' (ఎన్ఎస్ పి) ఆయుధాలను అనధికారికంగా మార్కెట్ లో విక్రయించినందుకు వీరిపై చర్య తీసుకుంటున్నారు. సైనిక దళాల సిబ్బంది తమ వ్యక్తిగత ఉపయోగం కోసం 9ఎంఎం పిస్టల్స్ లేదా '.30' బోల్ట్-ఏక్షన్ రైఫిల్స్ వంటి నిషిద్ధ బోర్ ఆయుధాలను అత్యంత చౌక ధరలకు ఆయుధ ఫ్యాక్టరీల నుంచి పొందవచ్చు. వీటిని ఎన్ఎస్ పి ఆయుధాలని అంటారు. వారిలో కొందరు అధికారులు ఆయుధ డీలర్ల బృందం సాయంతో ఈ ఆయుధాలను అనధికార మార్కెట్ లో విక్రయించారన్న కేసు ఇది.
'ప్రస్తుత నిబంధనలను ఉల్లంఘించి తమ ఎన్ఎస్ పి ఆయుధాలను విక్రయించినందుకు 41 మంది సైనికాధికారులపైన, ఒక జెసిఒపైన, రిటైరైన నలుగురు అధికారులపైన పాలనాపరమైన క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నారు. తమ ఆయుధాలను జబల్పూర్ లోని సెంట్రల్ ఆర్డినెన్స్ డిపోకి తిరిగి ఇచ్చివేయవలసిందిగా వారికి నోటీసులు కూడా పంపారు' అని రక్షణ శాఖ మంత్రి ఎ.కె. ఆంటోనీ బుధవారం రాజ్యసభలో తెలియజేశారు.
అంతే కాకుండా తమ ఎన్ఎస్ పి ఆయుధాల కోసం అనుమతించిన స్థాయి కన్నా ఎక్కువ రౌండ్ల మందుగుండు సామగ్రని కలిగి ఉన్న 25 మంది అధికారులను అభిశంసించినట్లు మంత్రి తెలిపారు. ఈ మొత్తం కేసుపై దర్యాప్తు కోర్టు (సిఒఐ)ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
'తమ ఎన్ఎస్ పి ఆయుధాలను విక్రయించిన అధికారుల జాబితాను శ్రీగంగానగర్ జిల్లా కలెక్టర్ అందజేశారు. వారిలో ఇద్దరు మేజర్ జనరల్స్, ఇద్దరు బ్రిగేడియర్లు కూడా ఉన్నారు. అయితే, ఈ వ్యవహారంలో వారికి పాత్ర లేదని, వారు నిందార్హులు కారని సిఒఐ తేల్చింది' అని ఆంటోనీ వివరించారు.
News Posted: 3 December, 2009
|