'గ్రీన్ హంట్'కు శ్రీకారం రాయపూర్ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్ట్ తిరుగుబాటుదారుల అణచివేతకు ప్రభుత్వం గురువారం 'ఆపరేషన్ గ్రీన్ హంట్' అనే సంకేత నామంతో దాడులు ప్రారంభించింది. 2005 నుంచి మావోయిస్టు శక్తులు, భధ్రతా దళాలు, ప్రభుత్వ అనుకూల సాయుధ వ్యక్తుల మధ్య హింసాత్మక సంఘటనలకు కేంద్రంగా ఉంటున్న ఛత్తీస్ గఢ్ లో తిరుగుబాటుదారులను అణచివేయడానికి 'గ్రీన్ హంట్' ను ప్రారంభించారు.
మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో కొన్నింటి నుంచి చాలా స్వల్ప స్థాయిలో ప్రతిఘటన ఎదురైందని, అయితే, ఇది వారి ఎత్తుగడ కావచ్చునని అధికారులు పేర్కొన్నారు. పోలీస్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ (డిఐజి) మీడియాతో మాట్లాడుతూ, 'మేము ఆపరేషన్ గ్రీన్ హంట్ ను మరింత పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం బీజాపూర్, దాంతెవాడ వంటి జిల్లాలలో ఈ కార్యక్రమం సాగుతోంది. మా వద్ద సమాచారం ప్రకారం, మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న లోతట్టు ప్రాంతాలలో పోలీసులకు ఎటువంటి ప్రతిఘటనా ఎదురుకావడం లేదు. ఇది మావోయిస్టుల ఎత్తుగడ కావచ్చు. కాని మేము మా అధికారులతో ఈ విషయమై ఇంకా చర్చిస్తున్నాం' అని తెలియజేశారు.
మావోయిస్టు తిరుగుబాటు శక్తులు తమ కార్యకలాపాలను 1960 దశకం ద్వితీయార్ధంలో ప్రారంభించి ఇప్పటి వరకు వేలాది మందిని హతమార్చాయి. మావోయిస్టుల ముప్పును అత్యంత తీవ్రమైనదిగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అభివర్ణించారు కూడా. కాని, పేద రైతులు, భూమి లేని కూలీల హక్కుల కోసం తాము పోరాడుతున్నామని తిరుగుబాటు శక్తులు చెబుతున్నాయి.
News Posted: 4 December, 2009
|