'లేట్' గా న్యాయం న్యూఢిల్లీ : గత సెప్టెంబర్ 27న జమ్ములోని తమ ఇంటిలోకి చొరబడిన ఒక లష్కర్ అగ్రశ్రేణి తీవ్రవాదిని రుక్సానా కౌసర్ కాల్చి చంపినప్పుడు ఆమె సాహసకృత్యానికి గుర్తింపు లభించింది. అందుకు ఆమెను సత్కరించారు కూడా. కాని కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సిఆర్ పిఎఫ్)లో హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న 42 సంవత్సరాల జయంతి పరిహార్ కు అంతటి అదృష్టం పట్టలేదు. న్యాయం కోసం జయంతి పరిహార్ పోరు సాగించింది. కాని విజయం సాధించినప్పుడు దానిని అనుభవించేందుకు ఆమె సజీవంగా లేదు. 2001 జనవరి 16న మూడు మాసాల గర్భిణి అయిన జయంతి పరిహార్ శ్రీనగర్ విమానాశ్రయంపై దాడి చేసిన ఆరుగురు టెర్రరిస్టులను ఎదుర్కొన్నది. ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెకు గర్భస్రావమైంది.
అనుపమాన ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు ఇచ్చే అవార్డు కోసం ఆమె పేరును సిఆర్ పిఎఫ్ సిఫార్సు చేసింది. కాని రక్షణ మంత్రిత్వశాఖ ఆ సిఫార్సును తోసిపుచ్చింది. ఉత్తరాంచల్ స్వస్థలమైన జయంతి పరిహార్ ను ఆమె గాయాల కారణంగా 'తక్కువ వైద్య తరగతి'లో ఉంచారు. ఆమెకు పదోన్నతులు తిరస్కరించారు. ఆమె 2009 మే 12న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం (డిసెంబర్ 4న) ఆమెకు న్యాయం జరిగింది. కాని అప్పటికే మూడు నెలలు ఆలస్యమైంది. గాయాల వల్ల తలెత్తిన విపరిణామాలతో ఆమె ఆగస్టు 20న మరణించింది. అయితే, పరిహార్ భర్త హరీష్ సింగ్ సాయంతో ఆమె న్యాయవాది రేఖ పల్లి పోరు కొనసాగించారు.
టెర్రరిస్టులతో ధైర్యంగా పోరు సాగించిన, యూనిఫామ్ ధరించిన మహిళకు ఇటువంటి గతి పట్టడమా అని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 1998 నుంచి రావలసిన పదోన్నతుల ప్రయోజనాలను, వాటితో లభించే సకల భత్యాలను పరిహార్ కుటుంబానికి అందజేయవలసిందిగా సిఆర్ పిఎఫ్ ను కోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి ప్రదీప్ నందరాజోగ్ సారథ్యంలోని ధర్మాసనం సిఆర్ పిఎఫ్ తీరుకు తీవ్రంగా ఆగ్రహం చెందింది. 'పెద్ద దుర్ఘటనను తప్పించిన సాహసవంతురాలిని ఇంత సుదీర్ఘ కాలం ఇక్కట్ల పాల్జేసినందుకు' ఖర్చుల నిమిత్తం సిఆర్ పిఎఫ్ ను రూ. 11 వేలు చెల్లించవలసిందిగా కోర్టు ఆదేశించింది.
News Posted: 5 December, 2009
|