రూపాయి అద్దె-అదీ బాకీయే న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం స్థలాన్ని లీజుకు తీసుకున్న విదేశీ దౌత్య కార్యలయమా మీది? అలా అయితే దానికి అద్దె చెల్లించడం గురించి ఆలోచించను కూడా అక్కర లేదు. జపనీయులు తమ రాయబార కార్యాలయానికి నెలకు ఒక్క రూపాయి నామమాత్రపు అద్దెను కూడా 42 సంవత్సరాలుగా చెల్లించడం లేదు. పాకిస్తాన్ సుమారు నాలుగు దశాబ్దాలుగా అదే పని చేస్తున్నది. జర్మనీ 15 ఏళ్ళకు పై నుంచి రూ. 1 అద్దె చెల్లించలేదు. మలేసియా 1981 వరకు, శ్రీలంక 1995 వరకు, సౌదీ అరేబియా 2002 వరకు ఆ నామమాత్రపు అద్దెను చెల్లించాయి.
అయితే, భారత ప్రభుత్వం ఈ విషయమై ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. 'ఫిర్యాదు చేసినా వ్యర్థమే' అని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దౌత్య కార్యాలయాలకు ఈ విషయం గుర్తు చేస్తూ లేఖలు రాయడం 'దౌత్యపరమైన మర్యాదలను' అతిక్రమించినట్లు అవుతుందా అనేది కూడా ఆయనకు తెలియదు.
తమ రాయబార కార్యాలయం లేదా హైకమిషన్ కార్యాలయాల కోసం స్థలాన్ని కేటాయించినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించిన దేశాల నుంచి ఇండియా నామమాత్రంగా రూ. 1 అద్దె వసూలు చేస్తుంటుంది. జర్మనీ, జపాన్, రష్యా రాయబార కార్యాలయాలకు, పాకిస్తాన్ హైకమిషన్ కు ఇ-మెయిల్ లో పంపిన ప్రశ్నావళికి సమాధానమే రాలేదు.
అయితే, ముందుగా అద్దె చెల్లించిన దేశాలు కొన్ని లేకపోలేదు. కెనడా 2076 వరకు, ఇటలీ 2016 వరకు అలా చెల్లించాయి.
News Posted: 7 December, 2009
|