సిమ్ కార్డు సిత్రాలు కోలకతా : మీ పేరు మీద జారీ అయిన సిమ్ కార్డు ఎవరైనా ఆగంతకుని చేతుల్లో పడవచ్చు. ఆ వ్యక్తి నేరస్థుడు కావచ్చు లేదా మావోయిస్టు నాయకుడు కిషన్ జీ కావచ్చు. టెలికామ్ రంగంలో పోటీ ముమ్మరంగా సాగుతుండడంతో టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు కొందరు 'ముందే ఏక్టివేట్' సిమ్ కార్డుల విక్రయానికి పంపిణీదారులను ప్రోత్సహిస్తున్నారు. ట్రాయి ఇలా చేయకూడదని స్పష్టంగా నిర్దేశిస్తున్నప్పటికీ ఈ సంస్థలు ఇలా చేస్తుండడం వల్ల భద్రతాపరమైన ఈ లోపాన్ని టెర్రరిస్టులు, నేరస్థులు అవకాశంగా తీసుకోగలుగుతున్నారు.
సిసలైన కస్టమర్ల డాక్యుమెంట్ల ఆధారంగా ఏక్టివేట్ చేసిన సిమ్ కార్డులను బెంగాల్ వీధులలో కేవలం రూ. 10 ధరకు అక్రమంగా విక్రయిస్తున్నారు. ఆ కస్టమర్లకు ఈ కుంభకోణం గురించి అసలు ఏమాత్రం తెలియదు. ముందుగానే ఏక్టివేట్ చేసిన అటువంటి 80 జిఎస్ఎం సిమ్ కార్డులను ఆదివారం ఉదయం హుగ్లీ సెరాంపూర్ లోని ఒక రోడ్డుపై స్టాల్ లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా (టిఒఐ) విలేఖరి వాటిలో ఐదు కార్డులను సంపాదించారు. ముందుగానే ఏక్టివేట్ చేశారని నిరూపించడానికి ఆయన వాటిలో ఒకదానిని ఉపయోగించారు కూడా.
ఎవరి పేర్లపై అక్రమంగా సిమ్ కార్డులు ఏక్టివేట్ అవుతున్నాయో ఆ కస్టమర్లకు ఏదో నేరంపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు సెల్ ఫోన్ ఆధారాన్ని బట్టి ఒక రోజు వచ్చి తమ ఇంటి తలుపు తట్టే వరకు ఆ విషయం తెలియదు. అలా ముందుగానే ఏక్టివేట్ చేసిన సిమ్ కార్డులను క్రితం సంవత్సరం నవంబర్ 26న ముంబైలో దాడులు జరిపిన ముష్కరులు, గౌహతి వరుస బాంబు పేలుళ్ళ దుండగులు ఉపయోగించారు. 26/11 టెర్రరిస్టులు ఉపయోగించిన ఒక సిమ్ కార్డును ఎన్నడూ కనీసం ఒక చిన్న నేరం కూడా చేయని ఒక మృతుని డాక్యుమెంట్లపై కోలకతాలో జారీ చేశారు.
ఆదివారం స్థానిక యువకులు కొందరు సెరాంపూర్ స్టేషన్ సమీపంలో సిమ్ కార్డులను బాహాటంగానే విక్రయిస్తూ కనిపించారు. 'చిన్న బల్లపై చెల్లాచెదురుగా పడవేసిన కార్డులను వారు ఒక్కొక్కటి రూ. 10 రేటుకు అమ్ముతున్నారు' అని అఖిల బెంగాల్ టెలి వర్తకుల సంక్షేమ సంఘం (ఎబిటిటిడబ్ల్యుఎ) సభ్యుడు ఒకరు చెప్పార. స్థానిక సెల్ ఫోన్ వర్తకులు కొందరు కస్టమర్లుగా నటిస్తూ ఆ యువకుల వద్దకు వెళ్ళారు. 'ఇటువంటి సిమ్ కార్డుకు ఏదైనా టెలికామ్ షాపులో రూ. 50 వెచ్చించవలసి ఉంటుంది. కొన్న వెంటనే సిమ్ కార్డులను ఏక్టివేట్ చేయగలమంటూ మమ్మల్ని ప్రలోభపెట్టజూశారు వారు' అని ఫోరమ్ సభ్యుడు ఒకరు తెలిపారు.
News Posted: 7 December, 2009
|