బంద్ మింగేసిన 250 కోట్లు హైదరాబాద్ : రెండు రోజుల తెలంగాణ బంద్ జంటనగరాలను భయకంపితం చేయడమే కాదు, ప్రశాంతతను భగ్నం చేయడమే కాదు ఈ నగరాన్ని కనీసం 250 కోట్ల రూపాయల మేరకు కొత్త పేదరికాన్ని తెచ్చిపెట్టింది. ఈ నష్టాన్ని పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం పరువూ పోయింది. నగరానికి పర్యాటనకు రావడం ప్రమాదకరమని పర్యాటకులు భయపడుతున్నారు. సాధారణ కార్యకలాపాలకు మంగళవారం తెరతీసినా వ్యాపారులు మున్మందు ఎమౌతుందోనని భయపడుతున్నారు.
నగరంలో గత వారం రోజులుగా నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయని, అలానే పరిశ్రమల్లో ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని, చిల్లర దుకాణాలు, షాపింగ్ మాల్స్ మూతపడ్డాయని ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు సూరజ్ అగర్వాల్ వివరించారు. గత వారం రోజులుగా జరుగుతున్న విధ్వంసకర సంఘటనలు, బంద్ లు కారణంగా దాదాపు 250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోడానికి ముందుకు రాకపోవడం శోచనీయమని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
నగర పర్యటక రంగం ఘోరంగా దెబ్బతిందని, ఆర్టీసితో పాటు ప్రైవేట్ బస్సులు, రైల్వేలు కూడా సమానంగా నష్టపోయాయని, హైదరాబాద్ రావడానికి ముందుగానే హోటల్ రూం లను బుక్ చేసుకున్న విదేశీ, స్వదేశీ పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారని అధికారులు వివరించారు. ప్రతీ నెల మొదటి వారంలోనే 25 శాతం వ్యాపారం సాగుతుందని, నగరంలో దాదాపు 90శాతం హోటళ్లు మూత పడ్డాయని రాష్ట్ర హోటల్ యజమానుల సంఘం కార్యదర్శి జగదీష్ రావు వివరించారు. సినిమా థియేటర్ యజమానులు కూడా బంద్ వల్ల మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఐదు వందల థియేటర్లలో అత్యధిక భాగం మూతపడ్డాయని వివరించారు.
News Posted: 9 December, 2009
|