కేసిఆర్ ది గ్రేట్ హైదరాబాద్ : రాజకీయ నిరుద్యోగలకు, పదవులు పోయిన, రాని, లేని నాయకులకు 'ప్రత్యేక తెలంగాణ' నినాదం పునరావాస పథకమని, గత నలభై సంవత్సరాలుగా ఇదే తంతు నడుస్తుందన్న అపప్రథకు ఇక చరిత్రలో స్థానం లేకుండా చేశారు తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణా స్వప్నానాన్ని నిజం చేసేందుకు ఆయన తన ప్రాణాలను ఫణంగా పెట్టారు. తెరాస ఓడిపోయింది. ఇక తెలంగాణ మూలనపడిందని ఆనందించిన అందరికీ కనువిప్పు కలిగించారు. ఉద్యమం ద్వారా తెలంగాణ సాధ్యమన్న మేథావుల అంచనాయే వాస్తవమని తేలింది. సాచివేత, సాగదీత ఎత్తుగడలతో ఏ సమస్యనైనా నీరుగార్చే కాంగ్రెస్ రాజకీయ ఉద్దండుల మెడలు వంచి కేసిఆర్ కేంద్రంతో తెలంగాణ పాట పాడించారు. శరీరంలో ఏ మూలను చూసినా గుప్పెడు కండయినా లేని బక్కపలచని మనిషి, గుండె బలంతో ఏనుగులాంటి కాంగ్రెస్ చేత గత పదకొండు రోజులూ సర్కస్ ఫీట్లు చేయించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రయను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో మేలిమలుపుగానే భావించాలి. రాష్ట్ర శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టమని ముఖ్యమంత్రి రోశయ్యను హస్తిన అధిష్టానం ఆదేశించడం రాష్ట్ర విభజనకు తొలి అడుగు అనే చెప్పాలి. ఈ ప్రక్రియ ఎంతకాలం కొనసాగుతుంది? ఏప్పటికి పూర్తవుతుంది? రాష్ట్ర ఏర్పాటుకు ఏన్నేళ్ళు పడుతుంది? ఇది కేసిఆర్ విజయమా? కాదా? అన్న అన్ని సందేహాలను పక్కన పెడితే ఇంతవరకూ ఆ తొలి అడుగు కూడా పడకుండానే ఉద్యమం ఊపిర్లు తీసేసిన గతకాల ఘనులు కంటే నిస్సేందహాంగా తెరాస కేసిఆర్, ఉద్యమధారులైన విద్యార్ధులు చరిత్రనే సృష్టించారు. 2009 తెలంగాణ ఉద్యమం భారతచరిత్రలో సువర్ణాధ్యాయంగా ఉండిపోతుంది.
ఈసారి ఉద్యమ ప్రత్యేక లక్షణాలు చాలా ఉన్నాయి. తెలంగాణ తెచ్చుడో... కేసిఆర్ చచ్చుడో అని ప్రకటించి కేసిఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం, దానిని కొనసాగించడం ఉద్యమంలో కేంద్రకం(న్యూక్లియస్)లా పనిచేసింది. దాని చుట్టూ అనూహ్యమైన శక్తులు రంగప్రవేశం చేసాయి. కేసిఆర్ దీక్ష ఆలంబనగా ఆందోళనను ఉధృతం చేయకపోతే మరెన్నటికీ ప్రత్యేక రాష్ట్ర సాధ్యం కాదన్న ఆలోచనతో మేథావి, విద్యార్ధీ, ఉద్యోగ వర్గాలతో పాటు తెలంగాణ కోరుతున్న తెరచాటు శక్తులు కూడా రంగంలోకి దిగాయి. దీనిలో మావోయిస్టుల ప్రభావం ఉంటే ఉండవచ్చును కాని, తెలంగాణ కాంగ్రెస్ నేతల తెరచాటు సహకారమే ఎక్కువన్నది బహిరంగ రహస్యం.
ఇక తెరాస నాయకత్వం ఈ సానుకూల పరిణామాలను అనుకూలంగా మార్చుకుంటూ ఉద్యమ నాయకత్వ స్థానంలో విజయవంతంగా నిలుచుంది. ఎక్కడా బిగి సడలకుండా, ప్రభుత్వాధినేతలకు ఊపిరి సలపనీయకుండా చేసింది. ఒకే రోజు కాంగ్రెస్ కోర్ కమిటీ ముమ్మార్లు సమావేశమైందంటేనే కేసిఆర్ దెబ్బ ఎంతబలంగా తాకిందో అంచనా వేయవచ్చు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ ఎనిమిదేళ్ల పాటు కేసిఆర్ తానొక్కైడే ఉద్యమాన్ని నడిపారు. ఎన్నో ఆటుపోట్లు, నమ్మక ద్రోహాల, ప్రజల తిరస్కృతి లాంటి చేదు అనుభవాలు ఎదురైనా పట్టువదలని విక్రమార్కునిలా పోరాడారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను ప్రభుత్వాలకు తెలిసేలా చేయడానికి ఆయన దీక్ష బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఆయన అనుకున్నది సాధించారు.
News Posted: 9 December, 2009
|