ఉద్యోగాల కోటా సవరణ? న్యూఢిల్లీ : షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసిలు)కు చెందినవారికి మాత్రమే ఉద్దేశించిన ఉద్యోగాల రిజర్వేషన్ ను రద్దు చేయడానికి కేంద్రం ఒక ప్రణాళికను రూపొందించింది. కేంద్ర సిబ్బంది, పి.జి., పింఛన్ల మంత్రిత్వశాఖలోని సిబ్బంది, శిక్షణ విభాగం వెలువరించిన ఆఫీస్ మెమోరాండం (ఒఎం) 'విస్తృత ప్రజా ప్రయోజనాల రీత్యా' కోటాను ఆ విధంగా ఉపసంహరించవచ్చునని సూచిస్తున్నది. ఎస్సీలు, ఎస్టీలు, ఒబిసిల ఎంపిక కోసం ఎన్నిసార్లు ప్రత్యేకంగా రిక్రూట్ మెంట్ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వంలో పెక్కు ఉద్యోగాల ఖాళీలు భర్తీ కాకుండా ఉండిపోతున్నందున ఇలా చేయవచ్చునని ఒఎం సూచిస్తున్నది. అటువంటి ఉద్యోగాలను రిజర్వేషన్ నుంచి తొలగించేందుకు ప్రతిపాదన పంపవచ్చునని అన్ని మంత్రిత్వశాఖలకు, విభాగాలకు ప్రభుత్వం తన ఒఎంలో సూచించింది.
నేరుగా రిక్రూట్ మెంట్ జరిపే సందర్భాలలో రిజర్వ్ డ్ ఖాళీలను రిజర్వ్ కానివిగా మార్చడంపై 'సార్వత్రిక నిషేధం' ఉందని అంగీకరిస్తూనే ఒఎం 'ప్రజా ప్రయోజనాల రీత్యా ఒక ఖాళీని నిరంతరంగా ఖాళీగా ఉండిపోనివ్వజాలని అరుదైన, అసాధారణ సందర్భాలలో సంబంధిత మంత్రిత్వశాఖ లేదా విభాగం ఆ ఖాళీ రిజర్వేషన్ రద్దుకు ప్రతిపాదనను సిద్ధం చేసుకోవచ్చు' అని సూచిస్తున్నది. ఆయా అధికారులే సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ ఒఎం కాపీ ఒకదానిని 'డక్కన్ క్రానికల్' పత్రిక సంపాదించింది.
News Posted: 14 December, 2009
|