2014 వరకూ చూస్తాం: తెరాస హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం కోసం 2014 వరకూ వేచి ఉండటానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం సూచించింది. తెలంగాణ ఇస్తామని ప్రకటించి రాజకీయ ఊబిలో చిక్కుకుని సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఊరట కలిగించే ప్రకటనగానే దీనిని భావించవచ్చు. ప్రత్యేక రాష్ట్రం వాగ్దానాన్ని నెరవేర్చేందుకు 2014 వరకు కాంగ్రెస్ అధినాయకత్వానికి సమయం ఇవ్వడానికి, అంతవరకూవేచి ఉండేందుకు తాను సుముఖంగానే ఉన్నానని టిఆర్ఎస్ ప్రకటించింది.
'ఆలోగా రాష్ట్రం ఏర్పడితే మాకు అంతకు మించిన ఆనందం మరేమీ ఉండదు. ఇది అంత తేలిక కాదని మాకు తెలుసు. అందుకే గరిష్ఠంగా 2014 వరకు, అంటే తదుపరి సార్వత్రిక ఎన్నికలు జరిగేంత వరకు వేచి ఉండేందుకు మేము సుముఖంగానే ఉన్నాం' అని టిఆర్ఎస్ నాయకుడు ఒకరు ప్రముఖ ఆంగ్ల దిన పత్రికతో చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సృష్టికి కాంగ్రెస్ స్వయంగా వాగ్దానం చేసినందున ఆ పార్టీపై ఒత్తిడి తీసుకురావలసిన అగత్యం తమపై లేదని టిఆర్ఎస్ నాయకుడు అభిప్రాయం వెలిబుచ్చారు.
కాగా, కాంగ్రెస్ నిర్ణయం తిరుగులేనిదని టిఆర్ఎస్ నాయకుడు, సిరిసిల్ల ఎంఎల్ఎ, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు (కెసిఆర్) కుమారుడు కె. తారకరామారావు (కెటిఆర్) చెప్పారు. 'తెలంగాణ సృష్టి అనేది ఒక బాణం వంటిదని, ఒకసారి వదలిన బాణాన్ని ఎలా అయితే ఉపసంహరించలేమో ఇదీ అటువంటిదేనని మా నాన్నగారు ఇప్పటికే స్పష్టం చేశారు. కాంగ్రెస్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది. కాంగ్రెస్ కు ఆ పని చేసేందుకు వ్యవధి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం' అని ఆయన తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించనిదే దీనిపై ఏ చర్యా తీసుకోలేమన్న కాంగ్రెస్ వైఖరికి స్పందిస్తూ తారక రామారావు రాజ్యాంగం గురించి ప్రస్తావించారు. రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలు తీసుకోవడం అవసరమేనని, కాని వాటిని పాటించడం కేంద్రానికి తప్పనిసరి కాదని రాజ్యాంగం సూచిస్తున్నదని ఆయన తెలిపారు. 'అందువల్ల, శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఒకవేళ తీర్మానం వీగిపోయినా నష్టం లేదు' అని కెటిఆర్ అన్నారు.
News Posted: 15 December, 2009
|