రోశయ్యకు మైండ్ బ్లాక్ హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణకు అనుకూలంగా, వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాల తలెత్తిన సంక్షోభాన్ని ఏవిధంగా అధిగమించాలో తనకు అంతుపట్టడం లేదని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గురువారం అంగీకరించారు. సమైక్య రాష్ట్రం ఆవశ్యకతపై ఆంధ్ర, రాయలసీమ ప్రజలలోల ఏకాభిప్రాయం ఉందని కూడా రోశయ్య చెప్పారు.
'కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో ఉద్యమాలు అప్పటికప్పుడు తలెత్తినవి. రాజకీయ పార్టీల ప్రేరణతో ప్రారంభమైనవి కావు' అని రోశయ్య అన్నారు. 'సమైక్య రాష్ట్రం కోసం సాగుతున్న ఉద్యమం ఉద్ధృతరూపం దాలుస్తోంది' అని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి హైదరాబాద్ లో విలేఖరులతో మాట్లాడుతూ, ప్రస్తుత సంక్షోభాన్ని ఏవిధంగా పరిష్కరించాలో సలహాలు ఇవ్వవలసిందిగా తాను మీడియాకు, రాజకీయ నాయకులకు, అధికారులకు, ఇతరులకు మనఃపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. 'సలహాలు ఇవ్వదలచిన వారు నన్ను విడిగా కలుసుకుని మాట్లాడవచ్చు' అని ఆయన సూచించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితి చాలా విలక్షణమైనదని, ప్రాంతీయ పార్టీలతో సహా రాజకీయ పార్టీలు తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై చీలిపోయాయని రోశయ్య పేర్కొన్నారు. ఇటీవలి వారాలలో సాగిన ఆందోళనల వల్ల రాష్ట్ర అభివృద్ధి దెబ్బ తిన్నదని ఆయన చెప్పారు. 'ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు జరిపించలేకపోతున్నందున పేదలకు ఉపాధి, ఆహారం లభించడం లేదు' అని ఆయన చెప్పారు. 'వాణిజ్య కార్యకలాపాలు జరగడం లేదు కనుక ప్రభుత్వం పన్ను రూపేణా ఆదాయం రావడం లేదు. ఇది సంక్షేమ పథకాలపై ప్రభావం చూపుతున్నది' అని రోశయ్య పేర్కొన్నారు.
విద్యా సంస్థల మూసివేత కారణంగా విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని, రవాణా రంగం స్తంభించిపోయినందున నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు బాగా పెరిగాయని ముఖ్యమంత్రి చెప్పారు.
కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం ప్రకటనతో తెలంగాణలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నప్పటికీ మరి రెండు ప్రాంతాలలో హింసాకాండ ప్రజ్వరిల్లుతున్నదని రోశయ్య చెప్పారు. ఈ అంశంపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తోను, ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్ సోనియా గాంధితోను చర్చించేందుక ఎప్పుడు దేశ రాజధానికి వెళుతున్నారనే ప్రశ్నకు ముఖ్యమంత్రి 'ఢిల్లీలో బాగా చలిగా ఉంది' అని సమాధానం ఇచ్చారు.
News Posted: 17 December, 2009
|