అధిష్టానం అంతే హైదరాబాద్ : కాంగ్రెస్ కేంద్ర అధిష్ఠాన వర్గం రాష్ట్ర విభజనపై తన వైఖరిని మార్చుకునే సూచనలు కనిపించడం లేదు. కానీ రాజీనామాలను ఉపసంహరించుకోవలసిందిగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలను మాత్రం ఆదేశించింది. న్యూఢిల్లీకి వెళ్ళిన పార్టీ సీమాంధ్ర నాయకులకు అసెంబ్లీ తీర్మాం లేకుండా రాష్ట్ర విభజన జరగదని నోటి మాటగా చెప్పడమే తప్ప వారికి ఎటువంటి వివరణా ఇవ్వలేదు. కాగా పార్లమెంట్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడడంతో ఆంధ్ర ప్రదేశ్ ను సమైక్యంగానే ఉంచాలన్న తమ డిమాండ్ పై ఎలా ముందుకు సాగాలో ఆ నాయకులకు అంతు పట్టడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక వివరణ వస్తే తప్ప కేంద్ర నాయకుల మౌఖిక హామీలను విశ్వసించడం కష్టం కాగలదని మాజీ మంత్రి జె.సి. దివాకరరెడ్డి శుక్రవారం చెప్పారు. నెల్లూరు కాంగ్రెస్ ఎంఎల్ఎ ఆనం వివేకానందరెడ్డి కూడా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర నాయకుల మౌఖిక హామీల ఆధారంగా తాము తమ రాజీనామాలను ఉపసంహరించుకోజాలమని చెప్పారు. కాగా, జిల్లాలలో ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ వాదులందరూ వెంటనే తమ రాజీనామాలను ఉపసంహరించుకుని పార్టీ నియమావళికి నిబద్ధులై ఉండాలని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కోరారు.
ఇది ఇలా ఉండగా, కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అనుసరిస్తున్న ప్రక్రియపై సమాచారం కోసం శాసనసభ్యులు రాష్ట్ర లెజిస్లేచర్ సెక్రటేరియట్ లో వాకబు చేస్తూ హడావిడి చేస్తున్నారు. 2000లో ఛత్తీస్ గఢ్, ఉత్తరాంచల్, ఝార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు అనుసరించిన ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి సెక్రటేరియట్ అధికారులు మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలోని లెజిస్లేచర్ సెక్రటేరియట్ లను సంప్రదించారు. ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోరుతూ ఆయా శాసనసభలలో ఎటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదని శాసనసభ్యులకు తెలియజేశారు.
3వ అధికరణం కింద నిర్దేశించిన ప్రకారం, రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన బిల్లును శాసనసభ్యుల అభిప్రాయాల సమీకరణ నిమిత్తం రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభకు పంపినట్లు, శాసనసభ్యుల అభిప్రాయాలను జత చేసి బిల్లును మధ్య ప్రదేశ్ లెజిస్లేచర్ తిరిగి పంపినట్లు మధ్య ప్రదేశ్ లెజిస్లేచర్ కార్యదర్శి రఘువంశి ఆంధ్ర ప్రదేశ్ లెజిస్లేచర్ సెక్రటేరియట్ కు తెలియజేశారు. రాష్ట్రపతి నుంచి అనుమతి పొందిన అనంతరం కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ పార్లమెంట్ లో బిల్లలను ప్రవేశపెట్టిన తరువాత మూడు రాష్ట్రాలను విభజించారు. తెలంగాణ ఏర్పాటు కోసం కూడా రాష్ట్రంలో అదే ప్రక్రియను అనుసరించనున్నారని, ఎటువంటి తీర్మానమూ అవసరం లేదని కాంగ్రెస్ ఎంఎల్ సి కె.ఆర్. అమోస్ సూచించారు.
News Posted: 19 December, 2009
|