ఎస్సార్సీ వేయాలి: పవార్ న్యూఢిల్లీ : తెలంగాణ సమస్యపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి) అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కూడా ఆదివారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ అంశంపై 'నిర్హేతుక' తీరులో నిర్ణయానికి వచ్చినందుకు కేంద్రాన్ని పవార్ తప్పు పట్టారు. ఇందుకు దేశవ్యాప్తంగా సమస్యల వలయంలో చిక్కుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)లోని మరొక కాంగ్రెస్ మిత్ర పక్షం డిఎంకె ఇంతకుముందే ఈ అంశంపై సరైన రీతిలో వ్యవహరించనందుకు కేంద్రాన్ని తప్పుపట్టింది.
ఎన్ సిపి జాతీయ సమ్మేళనంలో పవార్ ముగింపు ఉపన్యాసం ఇస్తూ, 'హేతుబద్ధం కాని ఏ నిర్ణయానికైనా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది' అని అన్నారు. ఈ సంక్లిష్ట సమస్యపై 'సహేతుకమైన' నిర్ణయం తీసుకోవడానికై రెండవ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్ఆర్ సి)ని ఏర్పాటు చేయాలని పవార్ కోరారు. ప్రత్యేక తెలంగాణపై సుమారు 50 సంవత్సరాల క్రితం ఎస్ఆర్ సి ఒక నిర్ణయం తీసుకున్నదని, కాని దానిని ఎవరూ ఆమోదించలేదని పవార్ ఈసందర్భంగా గుర్తు చేశారు. కాగా, రెండవ ఎస్ఆర్ సిని ఏర్పాటు చేయాలని పవార్ ఇప్పుడు కోరడం మహారాష్ట్ర విభజన డిమాండ్ కు బలం చేకూర్చవచ్చు.
ఇది ఇలా ఉండగా, సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ కూడా ఇదే అంశంపై కేంద్రంపై ధ్వజం ఎత్తారు. గౌహతిలో మాట్లాడిన ప్రకాశ్ కరత్ ఇప్పుడు అత్యవసరంగా చేయవలసింది చిన్న రాష్ట్రాల ఏర్పాటు కాదని, పెరుగుతున్న ధరలను అదుపు చేయడమని స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ అసంబద్ధమైనదని, ఎందుకంటే అది సమస్యలకు పరిష్కార మార్గం కాదని కరత్ గౌహతిలో ఒక బహిరంగ ర్యాలీలో తెలంగాణ సమస్యను ప్రస్తావిస్తూ అన్నారు.
News Posted: 21 December, 2009
|