శ్రీవారు చిన్నబోయారు తిరుపతి : తిరుమల ఆలయం చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆర్టీసి బస్సులు సోమ, మంగళవారాలలో తిరుమలకు నడవడం లేదు. రాష్ట్ర విభజనకు నిరసన సూచకంగా సమైక్య ఆంధ్ర ఉద్యమకాలులు 48 గంటల చిత్తూరు జిల్లా బంద్ కు పిలుపు ఇవ్వడమే ఇందుకు కారణం. డిసెంబర్ 21, 22 తేదీలలో తిరుమలకు వెళ్ళే బస్సులను తాము నిలువరిస్తామని ఉద్యమకారులు పట్టుబట్టడంతో తిరుపతి, తిరుమల మధ్య ఆర్టీసి బస్సు సర్వీసులను నిలిపివేయాలని ఆర్టీసి అధికారులు నిశ్చయించారు. శ్రీ వేంకటేశ్వరుని దర్శనార్థం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే వేలాది మంది యాత్రికులకు దీని వల్ల అసౌకర్యం కలగగలదు. అసలు భక్తులను తిరుమల దేవుని దర్శనానికే రావద్దని ఉద్యమ నాయకులు సూచన చేశారు.
ఆర్టీసి రోజూ తిరుపతి, తిరుమల మధ్య రమారమి 450 బస్సులను నడుపుతుంటుంది. సుమారు 30 వేల మంది నుంచి 50 వేల మంది వరకు యాత్రికులు ఈ బస్సులలో ప్రయాణిస్తుంటారు. కాని రాష్ట్ర విభజన ప్రతిపాదనకు నిరసనగా ఉద్యమం ప్రారంభమైన తరువాత గడచిన పది రోజులలో 150 బస్సులు మాత్రమే ఘాట్ రోడ్డుపై నడిచాి. యాత్రికులకు అసౌకర్యం కలిగించరాదనే ఉద్దేశంతో ఉద్యమకారులు తిరుమల, తిరుపతి బస్సులకు 'మినహాయింపు' ఇచ్చారు. అయితే, 'మా సమైక్య ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా డిసెంబర్ 21, 22 తేదీలలో తిరుమల బస్సు సర్వీసులను కూడా మేము అడ్డుకుంటాం' అని నాయకుడు ఒకరు చెప్పారు.
వాస్తవానికి ఈ నెల 10 నుంచి 1420 అంతర్ జిల్లా సర్వీసులు, తమిళనాడు వెళ్ళే 190 సర్వీసులు, కర్నాటక వెళ్ళే 150 సర్వీసులు నిలచిపోయాయి లేదా వాటికి అంతరాయం కలిగింది. 'మాకు ఇప్పటికే గడచిన పది రోజులలో రూ. 12 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది' అని ఆర్టీసి సీనియర్ అధికారి చెప్పారు. ఆర్టీసికి ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో నష్టం సంభవించలేదని ఆయన తెలిపారు. 'ప్రస్తుత ఉద్యమం కారణంగా అంతర్ జిల్లా బస్సు సర్వీసులను మేము తగ్గించినప్పటికీ, ఘాట్ రోడ్ పై సర్వీసులను మేము నిలిపివేయలేదు. కాని ఇప్పుడు ఆలయం సర్వీసులు కూడా మేము నిలిపివేయవలసి వస్తున్నది. ఉద్యమకారులు యాత్రికులను లక్ష్యం చేసుకుంటారేమోనని మేము ఆందోళన చెందుతున్నాం. అందుకే ఈ నెల 21, 22 తేదీలలో సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం' అని ఆయన వివరించారు.
బంద్ రెండు రోజులలో తమ వాహనాలనైనా నడవనిస్తారో లేదోననే ఆందోళనతో ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లు ఉన్నారని తెలుస్తున్నది. వారు జీపులు, వ్యానులు, అంబులెన్సులు, ఆటోలు నడుపుతుంటారు. ఇది ఇలా ఉండగా, పుణ్య క్షేత్రంలో బంద్ పాటించవద్దని రాజకీయ పార్టీల నాయకులకు, సమైక్య ఆంధ్ర ఉద్యమకారులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు విజ్ఞప్తి చేశారు. 'బంద్ వల్ల యాత్రికులు అసౌకర్యానికి గురి కావడమే కాకుండా ఈ పుణ్య క్షేత్రం ప్రతిష్ఠకు కూడా భంగం కలుగుతుంది. బంద్ నుంచి ఈ పట్టణాన్ని మినహాయించండి' అని ఆయన ఉద్యమకారులను కోరారు. డికె వైఖరికి నిరసన తెలియజేస్తూ ఎస్ వి విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.
News Posted: 21 December, 2009
|