హైదరా'బాధ'
హైదరాబాద్ : హైటెక్ సిటీ... చార్మినార్... బుద్ధ విగ్రహం- బ్రాండ్ హైదరబాద్ ఇప్పుడు దిగ్బంధనంలో ఉంది. రాజకీయ సంక్షోభం ఆర్ధిక వ్యవస్థను నిప్పుల కుంపటిపైకి నెట్టింది. పరిశ్రమలను సెగలు దహించివేస్తున్నాయి. రాజకీయ అశాంతి కొనసాగుతున్న కొద్దీ నష్టాలు పొరలు పొరలుగా పెరుగుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ అనేక రంగాల పైకి ఈ ప్రభావం పాకుతోంది. అతి వేగంగా వాటి భవిష్యత్ ను కబళించివేస్తోంది. మరికొంతకాలం పరిస్థితి ఇలానే ఉంటే పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా స్థంభించిపోయే ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే అనేక పరిశ్రమలు తమ విస్తరణ పథకాలను మూలన పడేశాయి. శరవేగంగా సాగుతున్న హైదరాబాద్ అభివృద్ధికి వేర్పాటు ఉద్యమాలు బలమైన బ్రేకులే వేశాయి.
ఔషధ పరిశ్రమలు, ఐటి కంపెనీలు, ఆతిధ్య, పర్యాటక రంగాలు బాగా దెబ్బతిన్న జాబితాలో ఉన్నాయి. గడచిన మూడు వారాల్లో హైదరాబాద్ నగరానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) తేల్చి చెప్పింది. 'రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడాలన్నదే మా ధ్యేయం. ప్రస్తుతానికి పరిస్థిని చక్కదిద్దే అవకాశం ఉంది. కాని మరి కొంతకాలం ఈ అనిశ్చితి కొనసాగితే మాత్రం కష్టం. పరిశ్రమలు కష్టాల కడలిలో చిక్కుకుంటాయి' అని సిఐఐ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ వై హరిశ్చంద్ర ప్రసాద్ వివరించారు. ఇప్పటికే పరిశ్రమలపై ఉద్యమం ప్రభావం చూపించడం మొదలైందని ఆయన హెచ్చరించారు.
ఒక బహుళజాతి సంస్థ తన ఔషధ తయారీ కర్మాగారం విస్తరణ పథకాన్ని విరమించుకుంది. కంపెనీలు తమకు ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు అంతరాయం లేని సేవలు అందించడం ద్వారా వారిని కాపాడుకోవడమే భారంగా మారింది. ఇక విస్తరణ చేపట్టి కొత్త వినియోగదారులను ఆకర్షించడం పై అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆర్ధిక మాంధ్యంతో సతమతమయిపోయి అనేక కంపెనీలు దివాళాతీసిన నేపథ్యంలో ఐటి కంపెనీలకు ఈ ఉద్యమం మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా తయారైంది. ఇప్పుడిప్పుడే ఈ రంగం కోలుకుంటోంది. ఇప్పుడు అదనపు వ్యాపారం వచ్చే సమయంలో ఈ ఆందోళన తీవ్ర నష్టాలను కలిగించేలా ఉందని ఐటి నిపుణులు చెబుతున్నారు.
వీటన్నిచికంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కు ఉన్న పేరు ప్రఖ్యాతులకు దెబ్బతగిలే ప్రమాదం ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే మరి పరిశ్రమలు రావని చెబుతున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం సాగుతున్న ఉద్యమాన్ని మిగతా రాష్ట్రాలు పెట్టబడి దారులకు బూచిగా చూపెట్టి భయపెడుతున్నారని, అంతర్జాతీయ పెట్టబడులను వారు తమ వైపు తిప్పుకుంటున్నారని వివరించారు. అనేక కంపెనీలు తమ సమావేశాలను వాయిదా వేసుకుంటున్నాయి. హోటల్ పరిశ్రమ చాలా నష్టాలను ఎదుర్కొంటుందని చెబుతున్నారు.
News Posted: 22 December, 2009
|