ఐఐటిల్లో మహిళల రికార్డు ముంబై : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) కాంపస్ లలో మహిళలు తమ ఉనికిని చాటుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాలలో ఏడు ఐఐటిలలో ప్రవేశం కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జెఇఇ)లో ఉత్తీర్ణులైన మహిళల సంఖ్య దాదాపు మూడింతలైందని ఐఐటి అడ్మిషన్ సరళిని విశ్లేషిస్తున్న నివేదిక ద్వారా తెలియవచ్చింది.
2005లో జెఇఇ పాసైన మొత్తం అభ్యర్థులలో మహిళలు ఐదు శాతం మంది ఉన్నారు. 6433 మంది పాస్ కాగా వారిలో మహిళల సంఖ్య 381. 2009లో వారి సంఖ్య పది శాతం మేర పెరిగింది. 10035 మందిలో మహిళల సంఖ్య 1048. శాతంగా చూస్తే తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఇది చెప్పుకోదగిన మెరుగుదలే.
'మహిళల నుంచి వస్తున్న దరఖాస్తుల సంఖ్య కూడా పెరిగింది. ఐఐటిలలో కోర్సులను పురుషులకు మాత్రమే పరిమితమైనవిగా ఇక ఎంత మాత్రం భావించడం లేదు. చివరకు మహిళలు సాంకేతిక రంగాలపై ఆసక్తి కనబరుస్తున్నారు' అని ఈ నివేదికను రూపొందించిని ఐఐటి బొంబాయి జెఇఇ చైర్ పర్సన్ అనిల్ కుమార్ తెలియజేశారు.
ఈ పరిణామం పట్ల ఐఐటి పూర్వ విద్యార్థినులు కూడా హర్షం వెలిబుస్తున్నారు. 1992లో ఐఐటి బొంబాయిలో చేరిన 300 మందిలో కేవలం పది మంది విద్యార్థినులు ఉండగా వారిలో కవితా రమణన్ ఒకరు. 'మా వల్ల ఒక సీటు వ్యర్థమైందని, మేము చివరకు వివాహం చేసుకుని ఇంటిపట్టునే ఉండిపోతామని భావించినవారు ఉన్నారు' అని యుఎస్ రోడ్ ఐలాండ్ లోని బ్రౌన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కవితా రమణన్ చెప్పారు.
'పురుషుల ఆధిపత్యం గల ఐఐటిలకు తమ కుమార్తెలను పంపేందుకు తల్లిదండ్రులు ఇప్పటికీ భయపడుతుండవచ్చు. కాని కాంపస్ లో ఎటువంటి వివక్షా కనిపించదు' అని ఐఐటి బొంబాయిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం విద్యార్థిని సుఖదా పెండ్సె చెప్పారు. తన క్లాసులోని ఎనిమిది మంది విద్యార్థినులలో ఆమె ఒకరు.
News Posted: 23 December, 2009
|