'నోబెల్' సలహా చెన్నై : రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, సాచివేత పద్ధతుల నుంచి విముక్తి లభిస్తేనే విదేశాలలో పని చేస్తున్న భారతీయ సైంటిస్టులు దేశానికి తిరిగి రాగలరని తమిళనాడులో జన్మించిన నోబెల్ బహుమతి గ్రహీత వెంకటరామన్ రామకృష్ణన్ మంగళవారం స్పష్టం చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎ.ఎల్. ముదలియార్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ కు ప్రారంభోత్సవం చేసిన అనంతరం పాఠశాల, కళాశాలల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు డాక్టర్ రామకృష్ణన్ ఈ విషయం చెప్పారు. ఈ సంవత్సరం కెమిస్ట్రీలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న తరువాత డాక్టర్ రామకృష్ణన్ భారతదేశంలో పాల్గొన్న తొలి సమావేశం ఇదే.
'అధికార యంత్రాంగం, సాచివేత పద్ధతులు, స్థానిక రాజకీయాల నుంచి సైంటిస్టులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి. అప్పుడే వారు (విదేశాలలోని భారతీయ సైంటిస్టులు) దేశానికి తిరిగి రాగలరు' అని ఆయన చెప్పారు. తమ సైంటిస్టులను తిరిగి దేశానికి రప్పించడంలో చైనా సాధించిన విజయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అలా జరగని పక్షంలో యుఎస్ లేదా యూరప్ లో స్థిరపడిన భారతీయులు దేశానికి తిరిగి రావడం కష్టం కాగలదని డాక్టర్ రామకృష్ణన్ చెప్పారు. 'నా విషయానికి వస్తే, నేను వివాహం చేసుకున్న వనిత భారతీయురాలు కాదు. అందువల్ల నేను స్వదేశానికి తిరిగి రావడం సాధ్యం కాదు. అయితే, ఆర్థిక స్తోమత బాగా ఉన్నవారు కొందరు ఉన్నారు. వారు కచ్చితంగా తిరిగి రాగలరు' అని ఆయన చెప్పారు.
బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ వంటి భారతీయ సంస్థలలో పరిశోధన స్థాయిని డాక్టర్ రామ కృష్ణన్ మెచ్చుకున్నారు. ఎవరో నోబెల్ బహుమతి సాధించారని కాకుండా సైన్స్ ను చిత్తశుద్ధితో చదవవలసిందిగా విద్యార్థులకు ఆయన విజ్ఞప్తి చేశారు. 'మీరు ఏమి చేయాలని కోరుకుంటున్నారో అది చేయండి. ఒక తమిళుడు నోబెల్ బహుమతి స్వీకరించారని చెప్పి మాత్రం ప్రాథమిక విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేయవద్దు' అని డాక్టర్ రామకృష్ణన్ సలహా ఇచ్చారు.
News Posted: 23 December, 2009
|