యుద్ధ నౌకపై ప్రతిభ ముంబై : మన దేశానికి చెందిన ఏకైక విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్ లోకి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం అడుగుపెట్టి తొలిసారిగా సముద్రయాన అనుభవం పొందనున్నారని నౌకాదళ అధికారి ఒకరు తెలియజేశారు. దేశ సర్వ సైన్యాధిపతి అయిన ప్రతిభా పాటిల్ బుధవారం ఉదయం 11 గంటలకు ఐఎన్ఎస్ విరాట్ లోకి అడుగుపెడతారు. 'ముంబై వద్ద సముద్రంలో లంగర్ వేసి ఉన్న యుద్ధనౌకలోకి సర్వ సైన్యాధిపతి ప్రవేశిస్తారు. ఆమె హెలికాప్టర్ లో ఆ నౌకను చేరుకుంటారు' అని ఆ అధికారి తెలిపారు.
విశాఖపట్నంలో ఏడాది పాటు తిరిగి మెరుగులు దిద్దిన అనంతరం నవంబర్ లో ముంబైలోని తన స్థావరంలో తిరిగి విధులలో చేరిన ఐఎన్ఎస్ విరాట్ ను ప్రతిభా పాటిల్ తనిఖీ చేస్తారు. ఈ సంవత్సరంతో 50 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఐఎన్ఎస్ విరాట్ నౌకలో సుమారు మూడు గంటల పాటు ఆమె పరిశీలన జరుపుతారు. నౌకాదళ జెట్ యుద్ధవిమానాలు 'సీ హారియర్'ల గగన విహారాన్ని రాష్ట్రపతి తిలకిస్తారు.
భారత వైమానిక దళం (ఐఎఎఫ్) యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళగా ఘనత సాధించిన తరువాత ప్రతిభా పాటిల్ ఇప్పుడు విరాట్ లో విహరించబోతున్నారు. ఆమె నవంబర్ 25న ఐఎఎఫ్ ఫైటర్ జెట్ 'సుఖోయ్ ఎస్ యు-30'లో ప్రయాణించిన విషయం విదితమే.
రాష్ట్రపతి వచ్చే సంవత్సరం ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ జరుపుతారు. సెంటార్ శ్రేణి విమానవాహక నౌక 28 వేల టన్నుల ఐఎన్ఎస్ విరాట్ ను తొలుత 1959 నవంబర్ 18న హెచ్ఎంఎస్ హెర్మెస్ గా బ్రిటిష్ రాయల్ నేవీలో ప్రవేశపెట్టారు. అది సుమారు 28 సంవత్సరాలు బ్రిటిష్ నౌకా దళానికి సేవలు అందించిన తరువాత భారత నౌకా దళం 1987లో దానిని కొనుగోలు చేసింది. దేశ నౌకా, వైమానిక శక్తి ప్రదర్శనకు ఐఎన్ఎస్ విరాట్ కీలకం. ఇది సీ హారియర్ యుద్ధ విమానాలకు వేదికను ఏర్పాటు చేస్తుంది. ఈ యుద్ధనౌకలో 18 యుద్ధ విమానాల వరకు నిలపవచ్చు. జలాంతర్గాములను ఎదుర్కొనడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
News Posted: 23 December, 2009
|