ఎమ్సెట్ కన్వీనరే బాధితుడు హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రస్తుతం సాగుతున్న ఉద్యమాలు ముందుగా ఎంసెట్ పై ప్రభావం చూపాయి. ఎంసెట్ - 2010 కన్వీనర్ గా ప్రొఫెసర్ జి.కె. విశ్వనాథ్ ను నియమించిన రెండు రోజులలోనే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఎపిఎస్ సిహెచ్ఇ) ఆయనను మార్చవలసి వచ్చింది. ప్రొఫెసర్ విశ్వనాథ్ బదులు తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారిని ఈ పదవిలో నియమిస్తారు.
హైదరాబాద్ జెఎన్ టియు లో సీనియర్ ప్రొఫెసర్, మదింపు విభాగం డైరెక్టర్ గా ఉన్నప్రొఫెసర్ విశ్వనాథ్ ను ఎంసెట్ - 2010 కన్వీనర్ గా ఎపిఎస్ సిహెచ్ఇ సోమవారం నియమించింది. కాని విశ్వవిద్యాలయం సిబ్బంది నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో ఆయనను ఎపిఎస్ సిహెచ్ఇ తొలగించి జెఎన్ టియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ ఎన్.వి. రమణారావును నియమించింది. ఈ పదవిలో తెలంగాణ ప్రాంతం అధికారిని నియమించాలని విశ్వవిద్యాలయం సిబ్బంది గట్టిగా కోరారు.
ఎంసెట్ వంటి పరీక్ష నిర్వహణకు సారథిగా సామర్థ్యాన్ని బట్టి నియామకం జరపాలా లేక ఇతర కారణాలతోనా అనే చర్చ దీనితో విశ్వవిద్యాలయ వర్గాలలో మొదలైంది. ఎంసెట్ అత్యంత ఆదరణ చూరగొన్న, అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష. రాష్ట్రంలో ఏ ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సిఇటి) కన్నా ఎంసెట్ కే అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉంటుంది.
విశ్వవిద్యాలయం అధికారుల సమాచారం ప్రకారం, ప్రొఫెసర్ విశ్వనాథ్ చాలా సంవత్సరాలుగా మదింపు విభాగం డైరెక్టర్ గా జెఎన్ టియు పరీక్షల విభాగాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్ విశ్వనాథ్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే కారణంతో ఆయన నియామకానికి హైదరాబాద్ జెఎన్ టియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది దాదాపు 50 మంది తీవ్ర అభ్యంతరాలు లేవదీశారు. సిబ్బంది నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతుండడంతో హైదరాబాద్ జెఎన్ టియు వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ డి.ఎన్ రెడ్డి ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా ఎపిఎస్ సిహెచ్ఇకి విజ్ఞప్తి చేశారు. అధికారులు బుధవారం ఈ విషయమై జెఎన్ టియుతో చర్చించి ఆతరువాత ప్రొఫెసర్ విశ్వనాథ్ ను మార్చారు.
News Posted: 24 December, 2009
|