'వరల్డ్ స్పేస్' పలకదు చెన్నై : రేడియో శ్రోతలకు ఇది దుర్వార్తే. శాటిలైట్ రేడియో 'వరల్డ్ స్పేస్' కొత్త సంవత్సరం నుంచి దేశంలో మూగపోతున్నది. ఈ రేడియో ప్రసారాలు గురువారం (డిసెంబర్ 31) అర్ధరాత్రి నుంచి నిలచిపోతాయి. 'వరల్డ్ స్పేస్ శాటిలైట్ రేడియో సర్వీస్ డిసెంబర్ 31న ఇండియాలో తన కస్టమర్లందరికీ ప్రసారాలు నిలిపివేయనున్నది. వరల్డ్ స్పేస్ ఇండియా మాతృ సంస్థ వరల్డ్ స్పేస్ ఇన్ కార్పొరేషన్ ఆర్థిక నష్టాలు పెరిగిపోయిన పర్యవసానమే ఈ నిర్ణయం. ఆ సంస్థ 2008 అక్టోబర్ నుంచి దివాలా రక్షణ నిబంధనల పరిధిలో ఉన్నది' అని వరల్డ్ స్పేస్ సంస్థ ఒక ప్రకటనలో తన వినియోగదారులకు తెలియజేసింది.
ఈ విషయమై వ్యాఖ్యానించడానికి కంపెనీ అధికారులు అందుబాటులో లేకపోయారు. కాని 'మా ప్రసారాలను డిసెంబర్ 31న నిలిపివేస్తున్నాం. మీకు రావలసి ఉన్న బకాయిలకు సంబంధించి మీరు ఏవిధంగా డబ్బుల వాపసు కోరాలో వివరంగా ఇ-మెయిల్ సందేశాలు పంపగలం. కంపెనీ తీవ్ర ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటున్నది. నష్టాలు పెరిగిపోయాయి' అని కస్టమర్ సౌకర్యాల విభాగం అధికారులు తెలియజేశారు.
కస్టమర్ల వద్ద ఉన్న పోర్టబుల్, మొబైల్ రేడియో రిసీవర్ల ద్వారా వరల్డ్ స్పేస్ అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ రేడియో కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటుంది. కంపెనీ సుమారు 90 వేర్వేరు డిజిటల్ చానెల్స్ లో ప్రసారాలు చేస్తుంటుంది, సంగీత కార్యక్రమాలు, వివిధ భాషలలో వార్తలు, క్రీడల వార్తలు, సమాచారం, డేటా పంపిణీ చేస్తుంటుంది.
వరల్డ్ స్పేస్ సంస్థ ఆస్తుల కొనుగోలుకై సంస్థ యాజమాన్యంతో ఒక కొనుగోలుదారు చర్చలు సాగిస్తున్నట్లు ఇటీవల వార్తలు రాగా చందాదారులలో ఆశలు రేకెత్తాయి. 'వరల్డ్ స్పేస్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా గల ఆస్తుల కొనుగోలుపై ఆసక్తి చూపిన ఆ కొనుగోలుదారు సంస్థ ఇండియాలో వరల్డ్ స్పేస్ సంస్థకు చెందిన ఆస్తులు కొనరాదని, చందా వ్యాపారానికి సాయం చేయరాదని నిర్ణయించుకున్నది. పర్యవసానంగా వరల్డ్ స్పేస్ ఇన్ కార్పొరేషన్ ఇండియాలో తన చందా వ్యాపారాన్ని కొనసాగించలేదు' అని సంస్థ తన ప్రకటనలో వివరించింది.
News Posted: 26 December, 2009
|