తివారికి విఆర్ఎస్? డెహ్రాడూన్ : సెక్స్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాజకీయాల నుంచి ఐచ్ఛికంగా రిటైర్ కావలసిందిగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ్ దత్ తివారికి నచ్చజెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. ఆయన రిటైర్మెంట్ కోసం ఒక పథకాన్ని రూపొందించడానికై పార్టీ అధిష్ఠాన వర్గం ఇప్పటికే ఉత్తరాఖండ్ నాయకులు కొందరితో మాట్లాడింది కూడా. 'ఉత్తరాఖండ్ లో 2012 ఎన్నికలలో ఎటువంటి వ్యతిరేక పరిణామాలూ తలెత్తరాదని మేము కోరుకుంటున్నాం' అని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు.
పార్టీ ఈ విషయమై బాహాటంగా ఏ ప్రకటననూ ఇంతవరకు చేయకపోయినప్పటికీ కాంగ్రెస్ తన 125వ వార్షికోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఈ కుంభకోణం వెలుగు చూసిందని తివారికి స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
డెహ్రాడూన్ లోని ప్రతిష్ఠాకరమైన వన్య పరిశోధనా సంస్థ (ఎఫ్ఆర్ఐ) ప్రాంగణంలో స్థిరనివాసం ఏర్పరచుకోవాలని తివారి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం పార్టీకి రుచించడం లేదు. సైంటిస్టుల పనిలో ఇది రాజకీయ జోక్యమే అవుతుందని పార్టీ భావిస్తున్నది. వాస్తవానికి అనేక మంది రాజకీయ నాయకులు సంస్థ క్యాంపస్ లో తివారిని రోజూ కలుసుకుంటున్నారు. 'తివారీజీ డెహ్రాడూన్ లో బస చేయరాదు. మీడియా దృష్టికి రాకుండా కుమాన్ ప్రాంతంలోని స్వస్థలంలో ఆయన స్థిరపడాలని కోరుకుంటున్నాం' అని ఆ కాంగ్రెస్ నాయకుడు చెప్పారు.
అయితే, తివారి ఇంతవరకు పంతం వీడలేదు. ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేదు. తాను రాజకీయాల నుంచి నిష్క్రమించబోనని, తనకు అత్యంత విధేయులైన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు యశ్ పాల్ ఆర్య, తదితర నాయకుల అభ్యర్థనపై డెహ్రాడూన్ లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని అనుకున్నానని తివారి సోమవారం స్పష్టంగా ప్రకటించి పార్టీలో అనేక మందికి ఆగ్రహం కలిగించారు.
ఇది ఇలా ఉండగా, తివారి ఒక న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, తనపై వచ్చిన సెక్స్ కుంభకోణం ఆరోపణలకు తన మరణమే సమాధానం కాగలదని చెప్పారు. ఈ కుంభకోణంలో తన పేరును అక్రమంగా ఇరికించారని ఆయన ఆరోపించారు. అసలు ఈ కుంభకోణంలో పేరు వినిపించిన రాధిక అనే మహిళ గురించే తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు.
News Posted: 31 December, 2009
|