'తెలుగు'కు సుప్రీం నో! న్యూఢిల్లీ : తెలుగుకు ప్రాచీన 'సాంస్కృతిక' భాష ప్రతిపత్తి కల్పన సమస్యను సుప్రీం కోర్టు సాయంతో పరిష్కరింపచేయడానికి రాష్ట్ర అధికార భాషా సంఘం చేసిన ప్రయత్నం సోమవారం ఫలించలేదు. సంఘం పిటిషన్ ను పరిశీలించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ విషయమై పెండింగ్ లో ఉన్న పిటిషన్ ను త్వరగా తేల్చవలసిందని రాష్ట్ర హైకోర్టుకు ఆదేశం జారీ చేయడానికి కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్ సారథ్యంలోని ధర్మాసనం నిరాకరించింది. పెండింగ్ లో ఉన్న అంశంపై ఎలా వ్యవహరించాలో హైకోర్టుకు సుప్రీం కోర్టు ఉత్తర్వు జారీ చేయజాలదని ధర్మాసనం స్పష్టం చేసింది.
హైకోర్టు సంఘం వాదనను వినడం లేదని సంఘం తరఫు న్యాయవాది ధనంజయ్ ప్రసాద్ ఆరోపించినప్పుడు, 'వారు అలా చేస్తున్నారని మేము భావించడం లేదు. మీరు తిరిగి హైకోర్టు వద్దకు వెళ్ళి వారిని ఒప్పించండి' అని బాలకృష్ణన్ అన్నారు. తెలుగుకు రాజ్యాంగం అధికార భాష ప్రతిపత్తిని మంజూరు చేసినప్పుడు సంస్కృతం, తమిళం, కన్నడం వలె 'ప్రాచీన సాంస్కృతిక భాష'గా ప్రకటింపచేసుకోవడానికి తెలుగుకు అర్హత లభించిందని సంఘం తన పిటిషన్ లో పేర్కొన్నది. సంస్కృతానికి ప్రాచీన భాష ప్రతిపత్తి చాలా కాలం క్రితమే లభించిందని, ఆతరువాత తమిళానికి ఆ ప్రతిపత్తి మంజూరైందని, కన్నడానికి కూడా ప్రాచీన భాష ప్రతిపత్తి ఉందని నిరూపించడానికి కర్నాటక ప్రజలు పోరాడవలసి వచ్చిందని సంఘం తెలియజేసింది.
విజయనగరం సామ్రాజ్యాధిపతి కృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్సగా' తన గ్రంథాలలో కొనియాడినట్లు, అంటే అన్ని భారతీయ భాషలలో అత్యుత్తమమైన భాష తెలుగు అని అర్థమని సంఘం తన పిటిషన్ లో వివరించింది.
News Posted: 4 January, 2010
|