నడిరోడ్లపై అగ్రనేతలు న్యూఢిల్లీ : మీరు జాతీయ రహదారి గుండా ప్రయాణం చేయదలిచారా? అయితే ప్రధాని మన్మోహన్, యుపిఎ చీఫ్ సోనియా గాంధీలు కలసి రోడ్ పై మిమ్మల్ని పలకరించబోతున్నారు. ఏంటి వెంటనే ముస్తాబై మీరు కూడా వారిని పలకరించేందుకు బయలుదేరుతున్నారా..? ఆగండా..ఆగండి మీరు ముస్తాబైపోతే సరిపోతుందా..మరి మన్మోహన్, సోనియాలు కూడా ముస్తాబు కావాలి కదా.. కొద్దిరోజుల్లోనే వారు సంసిద్ధమై జాతీయ రహదారిపై కొలువు దీరబోతున్నారు. మీరు ప్రయాణం చేసే ప్రతీ 25 కిలోమీటర్లకు ఒకసారి వారు మిమ్మల్ని విష్ చేస్తూనే ఉంటారు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.
కాకపోతే విష్ చేసేది వారు కాదు, వారి ఫోటోలు మాత్రమే. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మన్మోహన్, సోనియాల ఫోటోలతో కూడిన బిల్ బోర్డ్ లు ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ(నెహాయ్) శరవేగంతో సన్నాహాలు చేస్తోంది. దేశంలోని అన్ని జాతీయ రహదారులపై 10 అడుగుల ఎత్తు 20 అడుగుల వెడల్పు సైజు గల 1500 బోర్డ్ లు అతి త్వరలోనే దర్శనమీయబోతున్నాయి. ప్రతీ 25 కి.మీ దూరానికి రోడ్డుకు ఇరువైపుల ఇంగ్లీషు, హిందీ, స్థానిక భాషల్లో ఈ బర్డ్ లు ఉండేలా జాతీయ రహదారుల సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ బర్డ్ ల పై ఆయా జాతీయ రహదారుల ప్రోజెక్ట్ లక్ష్యాలు, వ్యయాల వివరాలను పొందుపరచాలని అన్ని రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు పంపారు.
దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 1500 బోర్డ్ ల్లోఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, బీహర్ రాష్ట్రాల్లో 282, రాజస్థాన్, గుజరాత్, హర్యానాల్లో249, తమిళనాడు, పుదుచ్చేరిల్లో214, ఆంధ్రలో 170, మహారాష్ట్ర, గోవాల్లో 126, మద్యప్రదేశ్ ,ఢిల్లీలో120, పశ్చిమబంగాల్, ఒరిస్సాల్లో108, కర్ణాటక, కేరళల్లో 91, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో70, అస్సాం తదితర ఈశాన్య రాష్ఠ్రాల్లో 58 బిల్ బోర్డ్ లు ఏర్పాట్లు చేయాలని ఎన్ హెచ్ఎఐ నిర్ణయించింది. అయితే ఈ బిల్ బోర్డ్ ప్రచార వ్యవహారం ప్రధాని మన్మోహన్, యుపిఎ చీఫ్ సోనియాలకు తెలిసి నిర్ణయం తీసుకున్నారా లేక అత్యుత్సాహంతో ఎవరైనా కిందిస్థాయి అధికారి ఈ ప్రణాళిక రూపోందిచారా అన్నది తేలాల్సి ఉందని ఎన్ నెహాయ్ అధికారి అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఆర్ధిక మాంద్యం కారణంగా ప్రభుత్వ ధనం వెచ్చించి నేతల ఫోటోలతో పథకాల ప్రచారాన్ని నిషేధించిన నేపథ్యంలో ఈ బిల్ బోర్డ్ ప్రచారం చేపట్టడం వెనుక యుపిఎ ఆంతర్యం ఏమిటో?
News Posted: 7 January, 2010
|