హైదరాబాద్ : స్పైస్ జెట్ విమాన సంస్థ ప్రయాణీకులతో ఒక ఆట ఆడుకుంది. ముంబైకి తీసుకెళ్ళడానికి డబ్బులు వసూలు చేసి హైదరాబాద్ లో వదిలేసింది. ఆ తరువాత మీ దారి మీరు చూసుకొండని సెలవిచ్చింది. విశాఖ ప్రయాణీకులకు నరకం చూపించింది. దాంతో వైజాగ్ - ముంబై ఎస్ జి 402 విమానం ప్రయాణికులు అనేక మంది శనివారం రాత్రి అంతా శంషాబాద్ విమానాశ్రయంలో నానా అగచాట్లు పడ్డారు. సంస్థ అలక్ష్య వైఖరితో వారు తమ తదుపరి ప్రయాణ ఏర్పాట్లను తామే చేసుకోవలసి వచ్చింది. వాళ్ల కష్టాలు విశాఖలోనే మొదలయ్యాయి. హైదరాబాద్ మీదుగా ముంబై విమాన సర్వీసు విశాఖలో రాత్రి 8 గంటలకు బయలుదేరవలసి ఉంది. కాని బయలుదేరడం ఆలస్యం అవుతుందంటూ పదే పదే ప్రకటనలు చేసిన తరువాత చివరకు రాత్రి 10 గంటలకు సంస్థ ఆ సర్వీసును రద్దు చేసింది. పైలట్ల పని గంటలు ముగిసినట్లు స్పైస్ జెట్ ఇందుకు కారణంగా తెలియజేసింది.
విమానంలో నుంచి లగేజిని కిందకు దింపివేశారు. తరువాత ప్రయాణికులకు రెండు మార్గాంతరాలు సూచించారు. టిక్కెట్ల సొమ్ము పూర్తిగా వాపసు పొందాలని లేదా ముంబైకి తదుపరి అందుబాటులో ఉండే విమానంలో వెళ్లవలసిందని వారికి సూచించారు. అంటే ప్రయాణికులు విశాఖలోనే ఎక్కువ సేపు నిరీక్షించవలసి ఉంటుందన్న మాట. విమాన సంస్థ అధికారులతో ప్రయాణికులు తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిపిన తరువాత ప్రయాణికులను హైదరాబాద్ విమానంలో సీట్లు ఏర్పాటు చేశారు. 'మేము గట్టిగా నిరసన వ్యక్తం చేసిన తరువాతే విమాన సంస్థ హైదరాబాద్ వరకు మేము విమానంలో ప్రయాణించడానికి సిద్ధపడింది. రాత్రి 11 గంటలకు విమానం హైదరాబాద్ కు బయలుదేరింది. ముంబైకి మా టిక్కెట్ల ఖరీదు రూ. 8000. హైదరాబాద్ చేరిన తరువాత మేము తిరిగి ఆగిపోయాం. మాకు ఎటువంటి సహాయమూ లభించలేదు' అని ప్రయాణికుడు ఒకరు ఆరోపించారు.
'ఇది మానసికంగా వేధించడమే తప్ప మరేమీ కాదు. తొలుత వారు విమాన సర్వీసులో జాప్యం చేశారు. విశాఖలో వేచి ఉండిపోవడం మాకు ఇష్టం లేకపోయినందున ముంబైకి వెళ్లేందుకు హైదరాబాద్ లో మరొక విమానాన్ని సంస్థ ఏర్పాటు చేస్తుందని భావించి మేము వారి సూచనకు అంగీకరించాం. కాని హైదరాబాద్ లో స్పైస్ జెట్ ముంబై విమాన సర్వీసుకు రూ. 12 వేలు అడిగింది. అసలు ముంబైకి టిక్కెట్ ధర రూ. 3000 కన్నా ఎక్కువ ఉండదు' అని మరొక ప్రయాణికుడు చెప్పారు.
కనీసం ముంబైకి ఒక బస్సులోనైనా సీట్లు ఏర్పాటు చేయవలసిందన్న ప్రయాణికుల అభ్యర్థనను విమాన సంస్థ తోసిపుచ్చింది. ఆదివారం సాయంత్రానికి ప్రయాణికులు ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు. చాలా మంది ముంబైకి ప్రైవేట్ బస్సులు ఎక్కారు. ఇది 15 గంటల ప్రయాణం. 'మాకు మార్గాంతరం లేదు. ఆహారం, ఇతర అవసరాలపై ఖర్చు పెట్టిన తరువాత సాయంత్రం 5 గంటలకు మేము బస్సు ప్రయాణానికి సిద్ధపడవలసి వచ్చింది. మేము సోమవారం తిరిగి విధులకు హాజరు కావలసి ఉంది' అని వేరొక ప్రయాణికుడు చెప్పారు.