రైల్ నెట్ లో ఫ్లైట్ టిక్కెట్లు న్యూఢిల్లీ : రోజూ తన వెబ్ సైట్ లో ఎనిమిది లక్షల పైచిలుకు రైల్వే టిక్కెట్లు బుక్ అవుతుండడంతో రైల్వే ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్ యు) ఐఆర్ సిటిసి ఇప్పుడు తన సేవలను విస్తరించి విమాన సంస్థల టిక్కెట్లను కూడా విక్రయించాలని నిర్ణయించింది. 'ప్రయాణ సంబంధిత సేవలన్నిటినీ ఒకే చోట పొందేందుకు ప్రయాణికులకు' సాయపడే ధ్యేయంతో ఈ సంస్థ తన వెబ్ సైట్ లో ఈ కొత్త సర్వీసును ప్రవేశపెట్టాలని సంకల్పించింది.
'ఉత్తరాదిలో పర్వత ప్రాంతాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న ప్రయాణికులు ఎవరైనా రైలు, విమానం టిక్కెట్ల కొనుగోలు నిమిత్తం వేర్వేరు చోట్లకు వెళ్ళవలసి వస్తున్నది. వారు ఇక మా వెబ్ సైట్ లో రైలు, విమానం టిక్కెట్లు రెండింటినీ బుక్ చేసుకోవచ్చు' అని ఐఆర్ సిటిసి మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ టాండన్ సూచించారు.తన కేటరింగ్ సర్వీసులను ప్రస్తుతం మెరుగుపరుస్తున్న సంస్థ ఇతర లక్ష్యాల గురించి టాండన్ ప్రస్తావిస్తూ, రైళ్లలో కేటరింగ్ సేవలు అందిస్తున్న కాంట్రాక్టర్లకు సర్వీసుతో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టాలని తాము యోచిస్తున్నట్లు తెలియజేశారు. 'మేము ప్రతి రైలుకు స్కోర్లు నిర్దేశించి, వాటిని కేటరింగ్ సర్వీసుల నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రోత్సాహక పథకానికి ముడిపెడతాం' అని టాండన్ చెప్పారు. ఐఆర్ సిటిసి 400 రైళ్లలో కేటరింగ్ సర్వీసులు సమకూరుస్తున్నది.
పలు రైళ్లలో పాంట్రీ కార్లలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉండడం గురించిన ప్రశ్నకు టాండన్ సమాధానం ఇస్తూ, అటువంటి పాంట్రీ కార్లలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఐఆర్ సిటిసి ప్రయత్నిస్తున్నదని తెలియజేశారు. '18 శాతం పాంట్రీ కార్లు అధ్వాన్నంగా ఉన్నాయని గుర్తించాం. వాటిని మెరుగుపరిచే కృషి ప్రారంభించాం' అని ఆయన తెలిపారు. చాలా పాంట్రీ కార్లలో నీటి బాయిలర్లు, హాట్ కేసులతోనే సమస్య తలెత్తుతున్నదని ఆయన చెప్పారు.
కేటరింగ్ సర్వీసులు లోపభూయిష్టంగా ఉంటున్నందుకు సంస్థ ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలకు గురవుతోంది. సంస్థ ఒక కేటరింగ్ విధానాన్ని రూపొందిస్తున్నది. రానున్న మాసాలలో సంస్థ ఆ విధానాన్ని ప్రకటించవచ్చు. సేవల మెరుగుదల, పరిశుభ్ర వాతావరణం కోసం ఎసి పాంట్రీ కార్లను ఏర్పాటు చేయాలని కూడా రైల్వే శాఖ యోచిస్తున్నదని టాండన్ తెలిపారు.
News Posted: 11 January, 2010
|