'జైలుకెళితేనే టికెట్' పట్నా : మీరు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహపడుతున్నారా...కానీ, ఈ చంద్రబాబు, రోశయ్య, డీఎస్, చిరంజీవిలు మీకు ఎన్నికల టికెట్ కేటాయింపునకు ముప్పతిప్పలు పెడుతున్నారా..పార్టీ ఫండ్ భారీగా ముట్టచెప్పేందుకు, డబ్బు మంచినీళ్లులా ఖర్చు చేస్తామన్నా..హామీ రావడం లేదా ..? మరేం ఫర్వాలేదు చిటెకలో మీ ముందు బి.ఫారమ్ వాలే మార్గం రానే వచ్చింది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే వీలైతే హత్యలు, కుదరకపోతే దోపీడీలు, లేదంటే కనీసం ఎవరిదైనా జేబు దోంగలించడమైనా చేస్తే మీకు ఎన్నికల టికెట్ రావడం ఖాయం. ఇవన్నీ చేస్తే అసెంబ్లీ సంగతేమో కానీ, జైలుకు వెళ్లడం ఖాయమని ఆలోచిస్తున్నారా..? అయినా ఈ నేరాలన్నీ చేస్తే టికెట్ ఇచ్చేదెవరని మథనపడుతున్నారా..ఇంకెవరూ మన లాలూనే. ఆవును ఆయనే స్వయంగా ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు.
జైలుకెళ్లిన వారికే వచ్చే ఎన్నికల్లో తాను టికెట్ కేటాయించబోతున్నట్లు లాలూ ప్రకటించారు. అంతేగాక జైలుకెళ్లినట్టుగా తనకు సర్టిఫికేట్ చూపితేనే టికెట్ కేటాయింపు జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. అసలు జైలుకెళ్లి ఎన్ని రోజూలు గడిపారన్నదే ప్రధాన ప్రతిపాదికగా తీసుకుంటామని లాలూ చెప్పారు. అయినా జైలుకెళ్లడానికి ఏ మాత్రం సంశయించాల్సిన అవసరం లేదని, బయట కంటే అక్కడ తిండి ఆవసరమైతే మందులు, చక్కని ఖద్దరు బట్టలు, దుప్పట్లు అన్నీ ఉచితంగానే లభిస్తాయని లాలూ భరోసా ఇచ్చారు. ఒక వేళ బయటకు ఎక్కడకైనా వెళ్లాల్సి వచ్చినా పోలీసుల ఎస్కార్ట్ ను కూడా ఉచితంగానే పొందవచ్చునవి ఆయన ఫ్రీ ఆఫర్ లను ప్రకటించారు. అంటే ఇప్పట్నించీ ఎమ్మెల్యే ట్రీట్ మెంట్ అన్నమాట. ఈ దేశంలో ఖైదీలకు, ఎమ్మెల్యేలకు కూడా బాడీ గార్డులు ఉచితంగా లభిస్తారని లాలూ వ్యంగ్యోక్తన్న మాట.
ఇంకేం ఎక్కడో దగ్గర ఏదో నేరం చేసేసి... ఊచలు లెక్కెట్టేసి... అటు పిమ్మట లాలూని కలసేసి... టికెట్ తీసేసుకుని బీహార్ అసెంబ్లీలో ఆడుగుపెట్టేద్దామనుకుంటున్నారా..అయితే తొందరపడకండి. నిజంగా లాలూ మాటలు నమ్మి జైలుకు వెళితే ఇక అక్కడే ఉండాలి. ఎందుకంటే బీహార్ లో పార్టీ తరుపున చేపట్టే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఉద్యమంలో భాగంగా పోలీసుల అరెస్ట్ లకు సైతం భయపడకుండా నిరసన కొనసాగించాలని కార్యకర్తలకు ఉద్భోద చేస్తూ లాలూ చేసిన వ్యాఖ్యలవి. సహజంగానే వ్యగ్యంగా, హాస్యోక్తితో వ్యాఖ్యలు చేసే లాలూ ఉద్యమంలో జైలుకెళితే కలిగే లాభాలను తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. పార్టీ తరుపున ఎవరు బాగా ఉద్యమంలో పాల్గోన్నారో తెలియాలంటే జైలుకి వెళ్లిన వారేనని తన భావనగా లాలూ చెప్పారు.
News Posted: 11 January, 2010
|