కొత్త ఆలూ చాలా చౌక పాట్నా : పాట్నా ప్రధాన కార్యాలయంగా గల కేంద్ర బంగాళాదుంపల పరిశోధనా సంస్థ (సిపిఆర్ఐ) రైతులకు, వినియోగదారులకు కొత్త సంవత్సర కానుకగా మూడు బంగాళాదుంపల వంగడాలకు రూపకల్పన చేసింది. క్రితం సంవత్సరం బంగాళాదుంపల ధరలు బాగా పెరిగిపోవడంతో వారు నష్టపోయారు కద సిపిఆర్ఐ సైంటిస్టులు కొత్త వంగడాలకు కుఫరి సూర్య, పుష్కర్, ఖ్యాతి అని నామకరణం చేశారు. వీటి ఉత్పాదకత మెరుగ్గా ఉంటుంది. వీటిలో ప్రొటీన్లు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో చక్కెర సగటు స్థాయిలో ఉంటుంది.
సిపిఆర్ఐ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ ఆర్.పి. రాయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'ఫ్రెంచ్ ఫ్రైలు, చిప్ లు చేసేందుకు ఉపయోగించే సగటు వంగడాల కన్నా కుఫరి సూర్య, పుష్కర్, ఖ్యాతి మెరుగైనవి. వీటిలో నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది' అని చెప్పారు. ఈ మూడు వంగడాలు విత్తిన 90 రోజులలో కోతకు సిద్ధంగా ఉంటాయని, మామూలు వంగడాలు ఇందుకు 100 రోజుల నుంచి 110 రోజులు తీసుకుంటాయని రాయ్ చెప్పారు. ఈ పంటను సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో వేయవచ్చునని ఆయన సూచించారు.
కొత్త వంగడాల ఉత్పత్తికి బీహార్, బెంగాల్, తూర్పు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలోని భూములు అనువుగా ఉంటాయని కనుగొన్నారు. 'ఈ కొత్త వంగడాల శోధన వల్ల ఈ రాష్ట్రాలలోని రైతుల ఆదాయం పెరుగుతుంది' అని సీనియర్ సైంటిస్ట్ ఒకరు చెప్పారు. బీహార్ లోని మొత్తం 38 జిల్లాలలో బంగాళాదుంపలు పండిస్తున్నారు. రాష్ట్రంలో 3 లక్షల హెక్టార్లలో బంగాళాదుంపల ఉత్పత్తి జరుగుతున్నదని వ్యవసాయ శాఖ వర్గాలు తెలియజేశాయి. బీహార్, బెంగాల్, తూర్పు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రైతులకు ఈ సెప్టెంబర్ లో ఈ కొత్త వంగడాల విత్తనాలు సరఫరా చేయనున్నట్లు సిపిఆర్ఐ సైంటిస్టులు తెలియజేశారు. కొత్త వంగడాల విత్తనాలను ముందుగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ శాఖలకు అందుబాటులోకి తీసుకురాగలమని, అవి ఆతరువాత విత్తడానికి, ఉత్పత్తి చేయడానికి రైతులకు సరఫరా చేస్తాయని సైంటిస్టులు వివరించారు.
క్రితం సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగాళాదుంపల ధరలు విపరీతంగా పెరిగిపోవడం బీహార్ లో పెను సమస్య అయింది. దీనితో 'లాలూకో బులావో, సస్తా ఆలు ఖావో (లాలూను అధికారంలోకి తీసుకురండి, బంగాళాదుంపలు చౌక ధరకు పొందండి)' అని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జెడి) కొత్త నినాదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో బీహార్ మార్కెట్లలో బంగాళాదుంపలు కిలో రూ. 25 నుంచి రూ. 27 వరకు రేటు పలికాయి. ఈ ధర ఇప్పుడు కిలో రూ. 10 నుంచి రూ. 12 వరకు తగ్గడంతో వినియోగదారులు ఉపశమనం పొందారు. కొత్త వంగడాల వల్ల ఉత్పత్తి, లభ్యత పెరుగుతాయని, ధరలు తగ్గుతాయని సైంటిస్టులు చెప్పారు.
News Posted: 12 January, 2010
|