'ఉద్యమ' కాలర్ ట్యూన్లు హైదరాబాద్ : తెలుగు సినిమాల్లోని ఆ పాత మధుర గీతాలను వినాలంటే సీడీలు, డీవీడీలు కొనుగోలు చేయడం కొద్దిరోజుల క్రితంనాటి మాట. అంధ్ర రాష్ట్రంలోని ఎవరిదైనా మొబైల్ కి కాల్ చేసి మంచి మంచి సినిమా పాటలు వినడం లేటెస్ట్ ట్రెండ్. అదీ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రరాష్ట్రంలోని సమైక్య, ప్రత్యేక ఉద్యమాల సెగ ఇప్పుడు కాలర్ ట్యూన్ లను తాకింది. తెలుగు సినిమాల్లో కొన్ని గీతాలను వారి వారి ఉద్యమాలకు అన్వయించుకొని సెల్ ఫోన్ ల కాలర్ ట్యూన్ లుగా వినిపిస్తున్నారు.
సమైక్యాంధ్ర, తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెపుతూ ప్రాచుర్యం పొందిన గీతాలను సమైక్యాంధ్ర ఉద్యమం సాగిస్తున్న వారు వినిపిస్తుండగా, తెలంగాణ చరిత్ర, వైభవాన్ని వివరించే సనీ గీతాలను ప్రత్యేక వాదులు తమ డయలర్ ట్యూన్ గా ఏర్పరుచుకుంటున్నారు. దీంతో ప్రత్యేక,. సమైక్య వాదులు కాలర్ ట్యూన్ ల ద్వారా కూడా తమ ఉద్యమాలను కొనసాగిస్తున్సట్లైంది. సమైక్యావాదులు ' తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది', 'ఓయి తెలుగు వాడా..' వంటి గీతాలను డయలర్ లకు వినిపిస్తున్నారు. కాలర్ ట్యూన్ ల ద్వారా ఉద్యమం సాగించడంపై కోస్తాంధ్రకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు మాట్లాడుతూ, సినీ గీతాల భావనల ద్వారా తమ సమైక్యాంధ్ర ప్రాముఖ్యతను వివరించాలనుకుంటున్నట్లు చెప్పారు. మాటల ద్వారా, ప్రసంగాలతో చెప్పేదాని కంటే సినీ గీతాల ద్వారా ఉద్యమ ప్రచారం సాగించడం చాలా ప్రయోజనం కలిగిస్తుందని తాము గుర్తించినట్లు చెప్పారు.
ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యమకారులు ' తెలంగాణ గట్టు మీద ఎన్నియల్లో',' ఊరు కదిలింది' వంటి గీతాలను కాలర్ ట్యూన్ లుగా వినియోగిస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన సురేంద్రనాథ్ అనే వ్యక్తి మాట్లాడుతూ, తెలంగాణా సెంటిమెంట్ ను, వైభవాన్ని విశదీకరించడంతో పాటుగా తెలంగాణకు జరిగిన అన్యాయంపై కూడా తెలుగు సినిమా పాటల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించేలా రచయతలు చేసిన గీతాలను కాలర్ ట్యూన్ లుగా ఎంచుకున్నట్టు చెప్పారు. ఈ కాలర్ ట్యూన్ లు ద్వారా ఉద్యమాన్ని మరింత వ్యాప్తి చేయడానికి దోహదం చేస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా రెండేళ్ల క్రితమే తాము మొబైల్ కంపెనీలను కలసి తెలంగాణకు చెందిన గీతాలను కాలర్ ట్యూన్ లుగా ఏర్పాటు చేయాలని విన్నవించినట్టు వివరించారు.
ఇదిలా ఉండగా, ఈ కాలర్ ట్యూన్ లు ఉద్యమం మొబైల్ టెలీ సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. బంద్ ల కారణంగా అన్ని వ్యాపారాలు దాదాపుగా నష్టాల్లో కూరుకుపోగా, కాలర్ ట్యూన్ లకు గిరాకీ పెరగడంతో సెల్ సర్వీసు ప్రొవైడర్ లు మాత్రం లాభాల బాట పట్టారు.
News Posted: 12 January, 2010
|