'కారు' చౌక బేరం న్యూఢిల్లీ : పాత సామాన్లు కొంటాం..పాత బట్టలు కొంటాం.. పాత ఇనుప ముక్కలు కొంటాం..వంటివి వీధుల్లో రోజూ వింటున్నవే. ఇవి వినీవినీ విసుగు చెందినవే. కానీ ఇకపై పాత బైక్ లు కొంటాం.. పాత కార్లు కొంటాం..పాత బండికి కొత్త బండి ఇస్తాం వంటి కేకలు వినపడనున్నాయి. ఈ కేకలు వేసిది ఏ పాత ఇనుప సామాన్లు వాడో కాదు, సాక్షాత్తూ భారత ప్రభుత్వమే ఈ ఆఫర్ ను ప్రకటించనుంది. పేరుకుపోతున్న కాలం చెల్లిన వాహనాలకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం ఈ ఆఫర్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. దీంతో పాత వాహనం ఇస్తే కొన్ని భారీ రాయితీలు కల్పించి కొత్త వాహనం అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశ వ్యాప్తంగా కాలం చెల్లిన కార్లు, బైక్ లు వంటివి కోటి వరకు ఉంటాయని అంచనా. వీటి కారణంగా వాతావరణ కాలుష్యం కలుగుతుండటంతో పాటుగా, ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని రవాణా శాఖ నివేదికను రూపొందించింది. ఈ వాహనాలను రీసైకిల్ చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శితో కూడిన బృందం అధ్యయనం చేసి పలు సూచనలు చేసింది.
పాత వాహనదారులకు రిబేటు కల్చించడం, విలువ ఆధారంగా జమ కట్టడం, ఎక్సయిజ్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలిచ్చే అంశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన పట్ల వాహనదారులు మొగ్గు చూపి తమ పాత వాహనాలను మారకం చేస్తారని భావిస్తున్నట్లు ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ సోసైటీ డైరక్టర్ జనరల్ దిలీప్ చెనోయ్ అభిప్రాయపడ్డారు.అయితే పాత వాహనాలను రీసైకిల్ చేసేందుకు భారీ కసరత్తే చేయాల్సి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్లాంట్ లు నెలకొల్పాలి. అయితే ఈ మేరకు ప్లాంట్ లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పరిశీలన చేస్తున్నట్లు భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి చెన్నైలో వాహనాలను రీసైకిల్ చేసేందుకు డెమో సెంటర్ ఉంది. అయితే ఇలాంటి సెంటర్ లను ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల్లో మరికొన్నింటిని నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఆటో ఎక్స్ పో లోవాహన రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.
వీటిని పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని భారీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి దిలీప్ చెనోయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఉన్న కాలం చెల్లిన వాహనాలను రీసైకిల్ చేయడం ద్వారా 17 లక్షల టన్నుల అల్యూమినియంను ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకు 7 శాతం సామర్థ్యం అవసరం ఉంటుందని ఆయన అంచనా వేసారు. అయితే భారత్ లో వాహనాలను రీసైకిలే చేసే యంత్రసామర్ధ్యం అంతగా లేదని, యూరోపియా దేశాల మాదిరి పద్ధతిని అనుసరించాల్సి ఉంటుందని వాహన రంగ నిపుణులు సూచనలు చేస్తున్నారు.
News Posted: 12 January, 2010
|