ఆ సరోద్ ఇక మ్రోగదు
ముంబయి : ఆ కళాకారునికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కడంలో పాలుపంచుకుంది. పాతికేళ్ల పాటు ఆయనకు తోడుగా ఉంది. ఆయనతో పాటు ప్రపంచం నలుమూలలకూ తిరిగింది. కానీ మన ఘనత వహించిన ఇండియన్ ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం పుణ్యమాని ఆ అనుబంధం తీగ తెగిపోయింది. అవును విశ్వవిఖ్యాత సంగీత విద్వాంసుడు ఉస్తాద్ అమ్జాద్ ఆలీ ఖాన్ చేతుల్లో రాగాలు పోయే సరోద్ వాయిద్యాన్ని ఎయిర్ లైన్స్ నాశనం చేసింది. విరగ్గొట్టి ఆ విద్వాంసుని చేతిలో పెట్టింది. ముక్కలైన తన ప్రియనేస్తాన్ని, తన ప్రాణాధికమైన సుస్వరాల వాయిద్యాన్ని చూసి అంతటి విద్వాంసుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు. తమ అనుబంధం తెగిపోయిందంటూ గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. అకస్మికంగా ముగిసిపోయిన తమ యుగళ గీతాన్ని తలచుకుని ఆయన రోధించారు.
ముంబయిలో ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఏర్పాటు చేసిన కచేరీలో ప్రదర్శన ఇవ్వడానికి అమ్జాద్ గురువారం నాడు అహ్మదాబాద్ లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఎక్కారు. ఆయన వెంట ఉండే సరోద్ వాయిద్యాన్ని విమానం కార్గోలో వేశారు. అది అలా అనేక వేల సార్లు ప్రయాణించింది. కానీ గురువారం ఉదయం ముంబయి ఎయిర్ పోర్టులో విరిగిపోయి, తీగలు తెగిపోయి ఉన్న సరోద్ ను అమ్జాద్ చేతుల్లో పెట్టారు ఎయిర్ లైన్స్ సిబ్బంది. దాన్ని చూడగానే అమ్జాద్ నిలువునా నీరైపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో ఆయన కచేరీ చేయలేకపోయారు.
ఎయిర్ లైన్స్ పోర్టరు సరోద్ ఉన్న పెట్టెను బలవంతంగా తెరవడానికి ప్రయత్నించి ఉంటారని అప్పుడే అది విరిగిపోయిందని అమ్జాద్ వివరించారు. ఇలాంటి అమూల్యమైన వస్తువుల పట్ల కనీస శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత ఎయిర్ లైన్స్ అధికారులపై ఉందని ఆయన చెప్పారు. ఆయన అసలు బాధ మరోకటి ఉంది. ఎప్పుడు సరోద్ కు మరమ్మతులు వచ్చిన దానిని వెంటనే సరిచేసి పెట్టి కచేరికి సిద్ధం చేసి పెట్టే వ్యక్తి గత నెలలోనే మరణించాడు. దాంతో తన పాతికేళ్ల నేస్తాన్ని తిరిగి సరిచేసి పెట్టే వ్యక్తి లేకుండా పోయాడని అమ్జాద్ వాపోయారు.
కాగా అమ్జాద్ కు భారత పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. అలానే ఇండియన్ ఎయిర్ లైన్స్ చైర్మన్ జితేంద్ర భార్గవ కూడా క్షమాపణలు కోరారు. ఒక మహా కళాకారుడికి ఈ నష్టం తీర్చలేనిదే అని, ఇక భవిష్యత్ లో కళాకారులు, వారి సామాగ్రి పట్ల ప్రత్యేక శద్ధ తీసుకుంటామని పటేల్ వివరించారు. వారిరువురూ అమ్జాద్ తో స్వయంగా మాట్లాడారు.
News Posted: 15 January, 2010
|