'జయను వద్దన్న ఎంజిఆర్' చెన్నై : సందర్భం వచ్చినప్పుడలా తన రాజకీయ ప్రత్యర్థి, ఎఐఎడిఎంకె అధినేత్రి జె. జయలలితపై విరుచుకుపడుచుండే తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎం. కరుణానిధి శుక్రవారం ఆమెపై మరికొన్ని వాగ్బాణాలు సంధించారు. జయలలితను రాజకీయాలలోకి తీసుకువచ్చినందుకు స్వర్గీయ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ విచారం వ్యక్తం చేశారని కరుణానిధి వెల్లడించారు. ఎంజిఆర్ మరణించి 23 సంవత్సరాలు గడిచిన తరువాత కూడా ఆయన వారసత్వంపై ఘర్షణ ఇంకా కొనసాగుతున్నదనడానికి కరుణానిధి చేసిన వ్యాఖ్యలే సూచిక. ఎంజిఆర్ తన రాజకీయ గురువు అని జయలలిత చేసిన ప్రకటనకు కరుణానిధి ఆక్షేపణ తెలియజేశారు.
ఈ విషయమై ఒక ప్రశ్నకు డిఎంకె నేత సమాధానం ఇస్తూ, 'మక్కళ్ కురళ్' పత్రిక సంపాదకుడు స్వర్గీయ టి.ఆర్. రామస్వామి 1989 జనవరి 1 నాటి సంచికలో రాసిన వ్యాసాన్ని ఉటంకించారు. జయలలితను రాజకీయాలలోకి తీసుకువచ్చినందుకు ఎంజిఆర్ పశ్చాత్తాపం ప్రకటించారని, రాష్ట్రం వదలి వెళ్ళవలసిందిగా కోరుతూ ఆమెకు ఆయన డబ్బు కూడా పంపారని రామస్వామి ఆ సంచికలో తన వ్యాసంలో తెలియజేశారు. ఎంజిఆర్ మరణానికి ఒక వారం ముందు తనతో మాట్లాడుతూ, జయలలిత తన రాజకీయాలలో కొనసాగినట్లయితే తన ప్రతిష్ఠకు హాని కలిగించగలరని, ఆమె రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి బెంగళూరులో గాని, హైదరాబాద్ లో గాని స్థిరపడాలని అన్నట్లు రామస్వామి తన వ్యాసంలో తెలిపారు.
'ఎన్నత్తాన్ నడక్కుమ్ నడకట్టుమే' అనే ఎంజిఆర్ పాటను తాను ఉటంకించినప్పుడు, ఎంజిఆర్ ఆ పాటను తనను (కరుణానిధిని) మనస్సులో పెట్టుకుని పాడారంటూ ఆయన వక్రభాష్యం చెప్పారని జయలలిత చేసిన వ్యాఖ్యలకు కరుణానిది ఈవిధంగా స్పందించారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ముగించేందుకు తాను శాసనసభకు వచ్చినప్పుడు తనను అవమానించారని జయలలిత చేసిన ఆరోపణపై ప్రశ్నకు కరుణానిధి సమాధానం ఇస్తూ, 'ఆమె ఇతరులను అవమానించలేదా' అని అడిగారు. సభా నాయకుడు, సీనియర్ నాయకుడు కె. అన్బళగన్ ను కించపరుస్తూ జయలలిత చేసిన వ్యాఖ్యలను కరుణానిధి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
News Posted: 16 January, 2010
|