పీజీ స్టైల్లో కేజీ స్టూడెంట్ న్యూఢిల్లీ : కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న ఎల్ కేజీ చిన్నారులు కూడా ఇకపై పీజీ విద్యార్థుల తరహాలో స్టయిలిష్ గా స్కూలుకి వెళ్లవచ్చు. తమ విద్యాసంస్ధల్లో అభ్యసిస్తున్న బాలలకు పుస్తకాల భారాన్ని తగ్గించాలని నిర్ణయించడంతో ఈ వెసులుబాటు లభించింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విద్యార్థుల పుస్తకాల బ్యాగు బరువుపై కేవీఎస్ ప్రత్యేక నియమ నిబంధనలను రూపొందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ విద్యాసంస్థలకు ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. అంతేగాక ఏ తరగతి చదువుతున్న విద్యార్థి ఎన్ని కేజీల బరువున్న పుస్తకాలను తీసుకు రావాలో ఉత్తర్వుల్లో నిర్దేశించింది. తమ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలంటూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఇటీవల తన అనుబంధ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఒకటి నుండి రెండు తరగతుల విద్యార్ధుల స్కూలు బ్యాగు రెండు కేజీలు మించరాదని, ఆలాగే మూడు నాలుగు తరగతులకు మూడు కేజీలు మించరాదని, ఐదు నుండి ఎనిమిది తరగతులు చదువుతున్న బాలల బ్యాగు నాలుగు కేజీలు ఉండాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తన ఆదేశాల్లో పేర్కొంది. ఆలాగే ఎనిమిది నుండి పన్నెండు తరగతుల విద్యార్థుల బ్యాగు ఆరు కేజీల బరువుకు మించరాదని ఆసంస్థ నిర్దేశించింది. ఆలాగే శనివారం స్కూల్ కి పుస్తకాలు తీసుకురానవసరం స్పష్టం చేస్తూ, ఆ రోజుని ' నో బ్యాగు డే' గా ప్రకటించింది.
విద్యార్ధులపై అధిక బరువులు మోపడం ద్వారా బాలల హక్కులకు భంగం వాటిల్లుతోందని, అలాగే వారికి వెన్ను సంబంధిత ఇబ్బందులు కలుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేవీఎస్ తన ఉత్తర్వుల్లో వివరించింది. అవసరమైన పాఠ్య పుస్తకాలను స్కూలులోనే విద్యార్థులు ఉంచేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. వాటర్ బాటిల్ కూడా ఇంటి నుండి తేవాల్సిన అవసరం లేకుండా పరిశుద్థమైన నీటిని అందించాలని సలహా ఇచ్చింది. కేవీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు విద్యార్థుల తల్లితండ్రుల్లోనూ, అటు స్కూల్ అధ్యాపకుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.
News Posted: 16 January, 2010
|