పిలానిలో బ్రహ్మోస్

జైపూర్ : ప్రతిష్ఠాకరమైన బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించిన విడిభాగాల కూర్పు కేంద్రాన్ని రాజస్థాన్ పిలానిలో ఏర్పాటు చేయనున్నారు. బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలాని)కి నెలవుగా ఇప్పటికే ఖ్యాతికెక్కిన పిలాని పట్టణం సమీపంలో ఇందుకోసం 80 హెక్టార్ల స్థలాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. భారత, రష్యా సంయుక్త ఉత్పత్తి అయిన బ్రహ్మోస్ క్షిపణులను ప్రస్తుతం హైదరాబాద్ లో కూర్పు (అసెంబుల్) చేస్తున్నారు. కేరళ రాజధాని సమీపంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ తిరువనంతపురం లిమిటెడ్ కార్యాలయం కూడా ఉన్నది.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఒ) చీఫ్ కంట్రోలర్, బ్రహ్మోస్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) శివథాను పిళ్ళై ఈ సందర్భంగా గత వారాంతంలో జైపూర్ వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో సమావేశమై సాధ్యమైనంత త్వరలో కొత్త కేంద్రం పనిని ప్రారంభించగలమని హామీ ఇచ్చారు. స్థలం కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పిళ్ళై ధన్యవాదాలు తెలియజేసి, బ్రహ్మోస్ క్షిపణి నమూనా ఒకదానిని గెహ్లాట్ కు అందజేశారు.
బ్రహ్మోస్ ను ప్రపంచంలో అత్యంత వేగంగా కదిలే క్షిపణి అని, కొత్త కేంద్రంపై రూ. 200 కోట్లు వెచ్చించనున్నామని గెహ్లాట్ కు డాక్టర్ పిళ్ళై తెలియజేశారు. ఈ క్షిపణి శబ్దం కన్నా మూడింతలు వేగంగా ప్రయాణిస్తుందని డాక్టర్ పిళ్ళై తెలిపారు. కొత్త కేంద్రంలో దాదాపు 150 మంది సాంకేతిక నిపుణులను నియమిస్తారు. రాజస్థాన్ కు చెందినవారికి నియామకాలలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.
బ్రహ్మోస్ ప్రాజెక్టు ఒకదానిని పిలానిలో ఏర్పాటు చేయాలన్నది డిఆర్ డిఒ ప్రతిపాదన. స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంస్థ అభ్యర్థించింది. వాస్తవానికి సుప్రసిద్ధ క్షిపణి శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ బిట్స్ పిలాని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికై విద్యా సంస్థను 2007 మార్చి, ఏప్రిల్ మధ్య సందర్శించినప్పుడు సంస్థ విద్యార్థులకు దేశ క్షిపణి కార్యక్రమంతో అనుసంధానం ఏర్పాటు చేసే అవకాశం గురించి సూచనప్రాయంగా తెలియజేశారు.
News Posted: 18 January, 2010
|